న్యూఢిల్లీ: 2030 నాటికి వస్తు, సేవల ఎగుమతులను 2 లక్షల కోట్ల డాలర్లకు పెంచుకోవాలన్న లక్ష్యం ఆచరణ సాధ్యమేనని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) ఎస్‌సీ అగర్వాల్ తెలిపారు. సులభంగా వాణిజ్య రుణాల లభ్యత ఇందుకు కీలకంగా ఉండగలదని ఆయన పేర్కొన్నారు. ఎగుమతుల్లో పోటీపడేందుకు ఇది తోడ్పడగలదని అగర్వాల్ వివరించారు. ఇటు దేశీయ వ్యాపారాలతో పాటు అటు సీమాంతర వాణిజ్యానికి కూడా సులభంగా రుణాలు లభించేలా చూడటంపై ప్రభుత్వం, ట్రేడర్లు కలిసి పని చేయాలని ఆయన సూచించారు. (ఆన్‌లైన్ ఫ్రాడ్: రూ. 40లక్షల కారు గోవిందా, మ్యూజిక్ డైరెక్టర్ లబోదిబో)
‘సీమాంతర వాణిజ్యంతో పోలిస్తే దేశీయంగా వ్యాపారాల కోసం రుణాలను పొందడం సులభతరంగా ఉంటుందని నాకు చెబుతుంటారు. సీమాంతర వాణిజ్యం చాలా రిస్కులతో కూడుకున్నదనే అభిప్రాయమే దీనికి కారణం కావచ్చు. మనం ప్రపంచ మార్కెట్లో పోటీపడాలంటే దీన్ని సరిదిద్దాలి. ఇందులో రుణాల లభ్యత కీలక పాత్ర పోషిస్తుంది‘ అని అగర్వాల్ చెప్పారు. కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం 2021–22తో పోలిస్తే 2022–23లో వస్తు, సేవల ఎగుమతులు 14.68 శాతం పెరిగి 676.53 బిలియన్ డాలర్ల నుంచి 775.87 బిలియన్ డాలర్లకు చేరాయి. (1200 లోన్‌తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు)
ఈ నేపథ్యంలో 2030 నాటికి వీటిని 2 ట్రిలియన్ డాలర్ల (లక్షల కోట్లు)కు పెంచుకోవాలని భారత్ నిర్దేశించుకుంది. మరోవైపు, ఇటీవలి అంతర్జాతీయ పరిణామాలతో వాణిజ్య నిర్వహణ తీరుతెన్నుల్లో గణనీయంగా మార్పులు వచ్చాయని నీతి ఆయోగ్ సీనియర్ సలహాదారు సంజీత్ సింగ్ తెలిపారు. కార్మిక శక్తి, వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, పర్యావరణ అభివృద్ధి మొదలైనవి వ్యాపారాల్లో కీలకంగా మారాయని, పలు దేశాలపై ప్రభావం చూపిస్తున్నాయని చెప్పారు. వాణిజ్యం విషయంలో భారత్‌ను ఏ దేశమూ వదులుకునే పరిస్థితి లేదని, మన ప్రయోజనాలను కాపాడుకునేందుకు తగు రక్షణాత్మక చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందని సింగ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment