అలా చేస్తే దేశ ప్రయోజనాలకు విఘాతం  | Rupee Devaluation or Weakening Detrimental to India Long Run Interest: Piyush Goyal | Sakshi
Sakshi News home page

బలహీన కరెన్సీ దేశ ప్రయోజనాలకు విఘాతం 

Published Thu, Apr 21 2022 10:29 AM | Last Updated on Thu, Apr 21 2022 1:10 PM

Rupee Devaluation or Weakening Detrimental to India Long Run Interest: Piyush Goyal - Sakshi

న్యూఢిల్లీ: కరెన్సీ విలువ తగ్గుదల ఎగుమతులను ప్రోత్సహిస్తుందన్న వాదనను వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ బుధవారం  తోసిపుచ్చారు. రూపాయి బలహీనపడటం దీర్ఘకాలంలో దేశ ప్రయోజనాలకు విఘాతమని ఆయన స్పష్టం చేశారు. భారతదేశం ఎగుమతులను గణనీయంగా పెంచుకోవడం,  దేశంలోకి విదేశీ మారకద్రవ్య ప్రవాహాన్ని పెంచేలా తగన పెట్టుబడులను వ్యూహాన్ని అనుసరించడం కీలకమని ఆయన అన్నారు. 15వ సివిల్‌ సర్వీసెస్‌ దినోత్సవం సందర్భంగా ‘‘విజన్‌ ఇండియా  ః 2047– గవర్నెర్స్‌’’ అన్న అంశంపై  ఆయన చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... 

  • ఎగుమతి మార్కెట్‌లో మీరు పోటీ పడేందుకు మీ కరెన్సీ విలువను తగ్గించాలని విశ్వసించే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. కానీ ఇది నిజం కాదు. రూపాయి విలువ తగ్గింపు లేదా మన కరెన్సీని బలహీనపరచడం వాస్తవానికి మన దేశ ప్రయోజనాలకు, మన వృద్ధి గమనానికి తీవ్ర విఘాతం.  దీర్ఘకాలంలో పోటీతత్వంగా ఉండే మన సామర్థ్యానికి హానికరమని నా స్వంత అనుభవంతో చెబుతున్నాను. పరిశ్రమ వర్గాలతో నేను వివిధ సందర్భాల్లో జరిపిన చర్చల్లో సైతం ఇదే విషయం స్పష్టమవుతోంది. 
  • దేశీయ కరెన్సీ విలువ తగ్గడం వల్ల దిగుమతుల ధర పెరుగుతుంది. దీనివల్ల  దేశంలో ద్రవ్యోల్బణం కట్టుతప్పుతుంది(దిగుమతుల ద్వారా వచ్చే ద్రవ్యల్బణం). ఇది వడ్డీరేట్ల పెరుగుదలకూ దారితీస్తుంది. ముడి పదార్థాల కోసం భారతదేశం దిగుమతిపై ఆధారపడి ఉన్నందున ఆయా ఉత్పత్తుల ధర తీవ్ర స్థాయికి చేరి, అంతర్జాతీయ విపణిలో పోటీ తత్వాన్ని దేశం కోల్పోతుంది. ఉదాహరణకు క్రూడ్‌ ధరల భారీ పెరుగుదల వల్ల ఎదురవుతున్న ద్రవ్యోల్బణం సమస్యలను మనం ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది.  
  • ఉదాహరణకు ఒక ఉత్పత్తిదారు తనకు కావాల్సిన డాలర్‌ విలువగల ఒక ముడి పదార్థం దిగుమతికి డాలర్‌ మారకంలో రూపాయి విలువ 70 ఉన్నప్పుడు, అంతమొత్తమే చెల్లిస్తాడు. అదే రూపాయి విలువ 77కు పడితే, సంబంధిత ముడి పదార్థం కోసం 77చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి అంతర్జాతీయ విపణిలో లేదా దేశీయంగా సంబంధిత ముడి పదార్థ ఆధారిత ఉత్పత్తి ధర పెరుగుదలకు దారితీస్తుంది. ఇది దేశంలో ద్రవ్యోల్బణానికి దారితీయడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ తత్వాన్ని భారత్‌ కోల్పోతుంది.  
  • రూపాయి ప్రస్తుత స్థాయిలోనూ (డాలర్‌ మారకంలో 75–77) భారత్‌ ఎగుమతులు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల లక్ష్యాన్ని (400 బిలియన్‌ డాలర్లు) విజయవంతంగా భారత్‌ సాధించింది. భారత్‌ భారీగా పెట్టుబడులను ఆకర్షించగలిగింది. ప్రవాస భారతీయులు భారీగా దేశానికి విదేశీ నిధులను (రెమిటెన్సులు) పంపారు. వెరసి భారత్‌ విదేశీ మారకద్రవ్య నిల్వలు దాదాపు 15 నెలల దిగుమతులకు సరిపడిన విధంగా 630 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అంతర్జాతీయంగా ఎటువంటి ఒడిదుడుకులనైనా తట్టుకునే స్థాయిలో ప్రస్తుతం భారత్‌ ఉంది. భారీ విదేశీ మారకపు నిల్వలు రూపాయి స్థిరత్వానికి కూడా దోహదపడే అంశం. 
  • 2022–23లో ఏప్రిల్‌ 1 నుంచి 14వ తేదీ మధ్య కూడా భారత్‌ ఎగుమతులు 18.5 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  
  • భారతదేశ ఫార్మా ఎగుమతులు భారీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. రాబోయే సంవత్సరాల్లో 200 బిలియన్‌ డాలర్లకు పెరుగుతాయని అంచనా.  
  • పరస్పర ప్రయోజనాలకు దోహదపడే రీతిలో  భారత్‌ పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరైట్స్‌ (యూఏఈ), ఆస్ట్రేలియాలతో ఈ విషయంలో భారత్‌ ముందడుగు వేసింది.  

    పాత చట్టాలను మార్చాలి: వాణిజ్య కార్యదర్శి సుబ్రహ్మణ్యం 
    కార్యక్రమంలో వాణిజ్య కార్యదర్శి బీవీఆర్‌ సుబ్రమణ్యం మాట్లాడుతూ,  రాబోయే సంవత్సరాల్లో భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని 30–40 ట్రిలియన్‌ డాలర్లకు పెంచడానికి పాత చట్టాలను పునః లిఖించడం, టెక్నాలజీ రంగంలో అద్భుత పురోగతి అవసరమని అన్నారు. మన వ్యవస్థలలో మానవ వనరుల సామర్థ్యాలను కూడా మనం మెరుగుపరచాలని, ఆలోచనా విధానంలో కూడా మార్పు అవసరమని ఆయన ఉద్ఘాటించారు. సివిల్‌ సర్వెంట్లు తమ శాఖలను పునర్‌ వ్యవస్థీకరించి, వాటిని ప్రపంచ స్థాయికి చేర్చాలని, తద్వారా భారతదేశం ప్రపంచ శక్తిగా మారాలని కార్యదర్శి కోరారు. ప్రైవేట్‌ రంగం నేతృత్వంలోని వృద్ధికి మనం కృషి చేయాలని ఉద్ఘాటించారు.  ప్రైవేట్‌ రంగానికి తక్కువ ఖర్చుతో కూడిన వ్యాపార వాతావరణం,  సంబంధిత లాజిస్టిక్స్‌ అవసరం కాబట్టి వారి అవసరాలపై దృష్టి పెట్టాలని  పిలుపునిచ్చారు. గ్లోబల్‌ వ్యాల్యూ చైన్‌లో ప్రస్తుతం భారత్‌కు పెద్ద భాగస్వామ్యం లేదని,  అయితే మనం ఇందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నామని ఆయన అన్నారు.

    దేశంలో వేతన వ్యయ సానుకూలత: కార్మిక కార్యదర్శి

    కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సునిల్‌ భరత్‌వాల్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ, భారత్‌ దేశం ఇప్పటికీ వేతన వ్యయ ప్రయోజనం పొందుతోందని అన్నారు. చైనా ఈ ప్రయోజనాన్ని కోల్పోయినట్లు పేర్కొన్నారు. దేశంలో అధికంగా ఉన్న యువత ప్రస్తుతం భారత్‌కు ప్రయోజనం కల్పిస్తోందన్నారు. వచ్చే 25 సంవత్సరాలపాటు ఈ ప్రయోజనాలు భారత్‌కు ఉంటాయని విశ్లేషించారు. దేశ పురోగతిలో శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 52 శాతంగా ఉన్నందున, ఈ శాతం మరింత పెరిగేలా చర్యలు అవసరమని ఆయన ఉద్ఘాటించారు.  ఈ దిశలో చర్యలు కొనసాగుతున్నట్లు కూడా తెలిపారు. 


రూపాయిః నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ 
ఇంటర్‌ బ్యాంక్‌ పారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ బుధవారం నాలుగు రోజుల వరుస నష్టాల నుంచి బయటపడింది. మంగళవారం ముగింపు 76.50తో పోల్చితే 20 పైసలు లాభపడి 76.30 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ల పెరుగుదల, అంతర్జాతీయంగా డాలర్‌ ఇండెక్స్‌ స్థిరత్వం వంటి అంశాలు దీనికి కారణం. ఆయా అంశాలు నిజానికి రూపాయిని మరింత బలపరచాల్సి ఉన్నప్పటికీ, దేశం నుంచి విదేశీ నిధుల ప్రవాహం దీనిని అడ్డుకుంది. ట్రేడింగ్‌లో 76.41 వద్ద ప్రారంభమైన రూపాయి, 76.16 గరిష్ట–76.52 కనిష్ట స్థాయిలను చూసింది.

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, ఈక్విటీ మార్కెట్ల పతనం నేపథ్యంలో ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి మారకం విలువ మార్చి 8వ తేదీన రూపాయి ఇంట్రాడే కనిష్టం 77.05 స్థాయిని చూస్తే, ముగింపులో 77గా ఉంది. రూపాయికి ఇవి రెండు చరిత్రాత్మక స్థాయిలు. రూపాయి భారీ పతనాన్ని నిరోధించేందుకు అవసరమైతే ఫారెక్స్‌ మార్కెట్‌లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జోక్యం చేసుకుంటోందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే  దేశీయ కరెన్సీకి నిజమైన పరీక్ష 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఎదురవుతుందన్నది నిపుణుల అంచనా. ఆర్‌బీఐ ప్రస్తుతం తన వద్ద ఉన్న 630 బిలియన్‌ డాలర్లకు పైగా విదేశీ మారక నిల్వలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) అస్థిరతలను అడ్డుకోడానికి, ప్రభావాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తుందని, ఇలాంటి సందర్భంలో 2023–24 రూపాయికి కీలకమవుతుందని విశ్లేషిస్తున్నారు. 

చదవండి: షాకింగ్‌..రిలయన్స్‌కు గట్టి దెబ్బ..! గత ఏడాది కంటే తక్కువ..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement