6 శాతం వృద్ధి అంచనాలు
గతేడాది 4.4 శాతమే
ప్రీమియం ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ
కాంటార్ వరల్డ్ ప్యానెల్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్‌ఎంసీజీ విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పుంజుకుంటాయని కాంటార్ వరల్డ్ ప్యానెల్ నివేదిక అంచనా వేసింది. అమ్మకాల్లో 6.1 శాతం వృద్ధి ఉండొచ్చని తెలిపింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో విక్రయాలు 4.4 శాతం పెరిగినట్టు వెల్లడించింది.
ఇక పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల విక్రయాలు ఫ్లాట్‌గా 4.2 శాతం మేర వృద్ధిని నమోదు చేయవచ్చంటూ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కసారి స్థిరత్వం నెలకొంటే అక్కడి నుంచి భారీ మార్పు కనిపించొచ్చని అభిప్రాయపడింది. పట్టణాలతో సమానంగా సమీప భవిష్యత్తులో పల్లెల్లోనూ అమ్మకాలు ఊపందుకోవచ్చని తెలిపింది. ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమకు సగం అమ్మకాలు గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తున్నట్టు గుర్తు చేసింది. ఎఫ్‌ఎంసీజీలో వృద్ధి జనాభా ఆధారంగానే ఉంటుంది కానీ, వినియోగం ఆధారంగా కాదని వివరించింది.
ఇవీ సమస్యలు..
ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, గ్రామీణ గృహ పరిమాణంలో తగ్గుదల, యుటిలిటీల కోసం (టెలిఫోన్, విద్యుత్, పెట్రోల్ తదితర) ఎక్కువగా ఖర్చు చేస్తుండడం, పొదుపుపై ఎక్కువగా దృష్టి పెట్టడం గ్రామీణ ప్రాతాల్లో ఎఫ్‌ఎంసీజీ వినియోగంలో స్తబ్దతకు కారణాలుగా కాంటార్ నివేదిక పేర్కొంది. కరోనా విపత్తు తర్వాత నుంచి గ్రామీణ మార్కెట్లలో ఎఫ్‌ఎంసీజీ వినియోగం పడిపోవడం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరంలోనే ఇది పుంజుకుంది.
ప్రీమియం ఉత్పత్తులకు ఆదరణ
ఇతర రంగాల మాదిరే ఎఫ్‌ఎంసీజీలోనూ ప్రీమియమైజేషన్ (నాణ్యమైన, ఖరీదైన బ్రాండ్ల వైపు మొగ్గు) ధోరణి వృద్ధి చెందుతోందని కాంటార్ నివేదిక తెలిపింది. ఇది మెరుగైన జీవన ప్రమాణాలను తెలియజేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కొన్ని విభాగాలు వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని ఇస్తున్నట్టు, దీంతో ప్రీమియం ఉత్పత్తులకు ఎక్కువ చెల్లించేందుకు ముందుకు వస్తున్నట్టు తెలిపింది. ఆహారం, ఫేస్ స్క్రబ్/పీల్/మాస్‌్క, బాడీ వాష్, హెయిర్ కండీషనింగ్ సిరమ్, ముసేలి, కొరియన్ నూడుల్స్‌ను ఉదాహరణలుగా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment