లక్నో, సాక్షి: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్‌సంగ్ నోయిడాలో ఏర్పాటు చేస్తున్న ప్లాంటుపై మరిన్ని పెట్టుబడులను వెచ్చించనుంది. స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే తయారీకి ఇక్కడ ఏర్పాటు చేస్తున్న యూనిట్ విస్తరణ కోసం రూ. 5,0000 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు శామ్‌సంగ్ వెల్లడించింది. ఎగుమతుల ఆధారిత ఈ యూనిట్ ఏర్పాటుకు ఇప్పటికే రూ. 1,500 కోట్లు వెచ్చించినట్లు తెలియజేసింది. ఈ ప్లాంటు 2021 ఫిబ్రవరికల్లా సిద్ధంకాగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. ఫలితంగా ఏప్రిల్‌కల్లా వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి ప్రారంభంకాగలదని అభిప్రాయపడింది.
మూడో దేశం
నోయిడాలో శామ్‌సంగ్ తయారీ యూనిట్ కార్యకలాపాలు ప్రారంభమైతే భారత్‌కు ప్రత్యేక స్థానం ఏర్పడుతుందని యూపీ పారిశ్రామికాభివృద్ధి మంత్రి సతీష్ మహానా పేర్కొన్నారు. ప్రపంచంలో శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే తయారీ యూనిట్లు కలిగిన మూడో దేశంగా భారత్ నిలవనున్నట్లు చెప్పారు. కంపెనీ ఇప్పటికే ఈ యూనిట్‌పై రూ. 1,500 కోట్లు వెచ్చించినట్లు తెలియజేశారు. చైనాలో కోవిడ్-19 తలెత్తాక దేశానికి తరలివచ్చిన అతిపెద్ద ప్రాజెక్టులలో ఇది ఒకటని వివరించారు. ఈ ప్రాజెక్టు కారణంగా 1,500 మందికి ఉపాధి లభించే వీలున్నట్లు చెప్పారు. ఈ యూనిట్ అన్ని పరిమాణాల డిస్‌ప్లేల తయారీ కోసం ఏర్పాటవుతున్నట్లు తెలియజేశారు. ఈ యూనిట్ తయారీ, అసెంబ్లింగ్, ప్రాసెసింగ్ తదితర కార్యకలాపాలను నిర్వహించనున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment