అత్యంత విలువైన సంస్థగా ఎస్‌బీఐ | SBI should become the best banker to Indians says Challa Sreenivasulu Setty | Sakshi
Sakshi News home page

SBI: అత్యంత విలువైన సంస్థగా ఎస్‌బీఐ

Published Thu, Aug 29 2024 5:24 AM | Last Updated on Thu, Aug 29 2024 8:17 AM

SBI should become the best banker to Indians says Challa Sreenivasulu Setty

అత్యుత్తమ బ్యాంక్‌గా అవతరిస్తాం 

కొత్త చైర్మన్‌ సీఎస్‌ శెట్టి సందేశం

న్యూఢిల్లీ: ఎస్‌బీఐ దేశంలోనే అత్యంత విలువైన ఆర్థిక సేవల సంస్థగా ఎదిగేందుకు కృషి చేస్తుందని, నికర లాభాలు పెంచుకుంటుందని కొత్త చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి (సీఎస్‌ శెట్టి) ప్రకటించారు. ఎస్‌బీఐని అత్యుత్తమ బ్యాంక్‌గా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని.. చైర్మన్‌ బాధ్యతల స్వీకరణ అనంతరం ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. 

50 కోట్లకు పైగా కస్టమర్లకు ఎస్‌బీఐ సగర్వంగా సేవలు అందిస్తోందని చెబుతూ.. వివిధ విభాగాల్లో మార్కెట్‌ అగ్రగామిగా ఉందని, అతిపెద్ద బ్యాలెన్స్‌ షీట్‌ పరంగా ఆస్తులపై ఒక శాతం రాబడి నిష్పత్తిని సాధించినట్టు వివరించారు. ‘‘అత్యంత విలువైన ఆర్థిక సంస్థగా ఎదిగేందుకు కృషి చేయాలి. నికర లాభం నూతన మైలురాళ్లకు చేరుకోవాలి. ప్రతి భారతీయుడి బ్యాంకర్‌గా ఎస్‌బీఐ స్థానం బలోపేతం కావాలి. అత్యుత్తమ సేవలు అందించాలి. 

ఉద్యోగులకు ఇష్టమైన సంస్థగా తీర్చిదిద్దాలి’’అంటూ ఎస్‌బీఐ సిబ్బందికి శెట్టి సందేశం ఇచ్చారు. 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఎస్‌బీఐ లాభం రూ.61,077 కోట్లుగా ఉండడం గమనార్హం. బ్యాంక్‌ చరిత్రలో ఇదే గరిష్ట రికార్డు. ‘‘మాతృభూమి అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ది దేశంగా మారుతున్న తరుణంలో మనం ఉండడం అదృష్టం. 

ఆర్థిక వ్యవస్థలో లోతైన నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఫైనాన్షియల్‌ మార్కెట్లు వేగంగా పరిణతి చెందుతున్నాయి. ఇది భారత్‌కు చెందిన దశాబ్దం. ఇది ఎస్‌బీఐ దశాబ్దం కావాలని కూడా నేను కోరుకుంటున్నాను’’అని శెట్టి పేర్కొన్నారు. ఇప్పటి వరకు చైర్మన్‌గా వ్యవహరించిన దినేష్‌ ఖరా పదవీ కాలం మంగళవారంతో ముగిసింది. ఈ నెల మొదట్లో శెట్టి నియామకం జరిగిన సంగతి తెలిసిందే.

తెలుగుతేజం.. అపార అనుభవం.. 
కొత్త చైర్మన్‌  శ్రీనివాసులు శెట్టి ఉమ్మడి పాలమూరు జిల్లా, మానవపాడు మండలంలోని  ఓ మారుమూల గ్రామం పెద్దపోతులపాడులో జని్మంచారు. ఆయన బాల్యం పూర్తిగా ఇదే గ్రామంలో గడిచింది. 7వ తరగతి వరకూ గ్రామంలోనే విద్యనభ్యసించిన ఆయన, అనంతరం గద్వాల్‌లో పదవ తరగతి, ఇంటర్‌ పూర్తిచేశారు. అటు తర్వాత హైదరాబాద్‌ వచ్చి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చరల్‌ బీఎస్సీ పూర్తిచేశారు. 

ప్రొబేషనరీ ఆఫీసర్‌గా కెరీర్‌ ప్రారంభం..  
1988లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎస్‌బీఐలో తన కెరీర్‌ను ప్రారంభించారు. గుజరాత్‌లో తొలుత పోస్టింగ్‌లో చేరిన ఆయనకు బ్యాంకింగ్‌లో మూడు దశాబ్దాల అపార అనుభవం  ఉంది. ఎస్‌బీఐలో పలు బాధ్యతలను ఆయన నిర్వహించారు. ముఖ్యంగా నాలుగేళ్లపాటు ఇంటర్నేషనల్‌ బ్యాంకింగ్స్‌లో భాగంగా ఎస్‌బీఐ ఓవర్సీస్‌ బాధ్యతలు స్వీకరించి అమెరికాలో పనిచేశారు. అక్కడి నుంచి తిరిగి వచి్చన తర్వాత ఎస్‌బీఐ ఎండీగా పదోన్నతి పొందారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకర్స్‌లో సరి్టఫైడ్‌ అసోసియేట్‌గా పనిచేశారు. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ టాస్‌్కఫోర్స్‌లు, కమిటీలకు నేతృత్వం వహించిన శెట్టి,  ఎస్‌బీఐ మెనేజింగ్‌ డైరెక్టర్‌గా ,  బ్యాంక్‌ రిటైల్, డిజిటల్‌ బ్యాంకింగ్‌ పోర్ట్‌ఫోలియోను పర్యవేక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement