ముంబై: ఆరంభ లాభాలు కోల్పోయిన స్టాక్ సూచీలు బుధవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఆర్‌బీఐ ద్రవ్య కమిటీ సమావేశ నిర్ణయాల వెల్లడి (నేడు)కి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఐటీ షేర్లలో లాభాల స్వీకరణతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీన సంకేతాలు సైతం సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి.
ఇంట్రాడేలో 621 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్ చివరికి 34 పాయింట్ల స్వల్ప నష్టంతో 72,152 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 71,938 వద్ద కనిష్టాన్ని, 72,559 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 22,053 – 21,860 రేంజ్ లో కదలాడింది. చివరికి ఒక పాయింటు లాభపడి 21,930 వద్ద నిలిచింది. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఫార్మా, రియల్టీ షేర్లకు డిమాండ్ నెలకొంది.
బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.31%, 0.38% చొప్పున పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,691 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,096 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో హాంగ్‌కాంగ్, ఇండోనేíసియా, చైనా తప్ప మిగిలిన అన్ని దేశాల సూచీలు ఒకశాతం మేర లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు 0.50% – 0.10% నష్టపోయాయి. అమెరికా మార్కెట్లు 0.25% లాభాల్లో ట్రేడవుతున్నాయి.
మార్కెట్లో మరిన్ని సంగతులు
► అమెరికా దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ క్యూ4 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో పాటు ఇటీవల ర్యాలీ నేపథ్యంలో ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. టెక్ మహీంద్రా 2.31%, ఇన్ఫోసిస్ 2%, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ షేర్లు ఒకశాతం చొప్పున నష్టపోయాయి.
► పేటీఎం రికవరీ ప్రయాణం బుధవారం కొనసాగింది. బీఎస్‌ఈలో ట్రేడింగ్ ప్రారంభంలో 10% పెరిగి రూ.496 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకి లాకైంది. రెండు రోజుల్లో షేరు 13% బౌన్స్‌బ్యాక్‌తో కంపెనీ మార్కెట్ విలువ రూ.3,720 కోట్లు పెరిగి రూ.31,548 కోట్లకు చేరింది.
► హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వాటా కొనుగోలుకు ఆర్‌బీఐ అనుమతినివ్వడంతో యస్‌బ్యాంక్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు వరుసగా 17%, 7% చొప్పున లాభపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment