ముంబై: మార్కెట్లో విస్తృతస్థాయి లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో శుక్రవారం సూచీలు ఈ ఏడాదిలో ఒకరోజు అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలు, క్యూ3 ఆర్థిక ఫలితాలకు ముందు అధిక వెయిటేజీ రియలన్స్ షేరు వెనకడుగువేయడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. బ్యాంకింగ్, ఆర్థిక, మెటల్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 746 పాయింట్లను కోల్పోయి 48,878 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 218 పాయింట్లు క్షీణించి 14372 వద్ద నిలిచింది. నష్టాల మార్కెట్లోనూ ఆటో, ఐటీ షేర్లు లాభపడ్డాయి. సూచీలకిది వరుసగా రెండోరోజూ నష్టాల ముగింపు. ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 156 పాయింట్లు, నిఫ్టీ 61 పాయింట్లను కోల్పోయాయి. అమెరికా నూతన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో పాటు బడ్జెట్ అంచనాలు రానున్న రోజుల్లో సూచీలకు దిశానిర్దేశం చేస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు.
స్వల్ప లాభాలతో మొదలై... భారీ నష్టాల్లోకి...
ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం స్వల్ప లాభాలతో మొదలైంది. మార్కెట్లో నెలకొన్న బలహీన పరిస్థితుల్లో సూచీలు లాభాలను నిలుపుకోలేపోయాయి. మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల నష్టాల ప్రారంభం ఇన్వెస్టర్లను మరింత కలవరపెట్టింది. దీనికి తోడు మార్కెట్‌కు వారంతాపు రోజు కావడంతో విక్రయాలు వెల్లువెత్తాయి. తొలి నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలకే కట్టుబడటంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 793 పాయింట్లు కోల్పోయి 48,832 వద్ద, నిఫ్టీ 233 పాయింట్లు కోల్పోయి 14,357 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి.
మరికొన్ని సంగతులు...
► మూడో త్రైమాసికపు ఆర్థిక ఫలితాల ప్రకటనకు ముందు రిలయన్స్ షేరు 2.5 శాతం నష్టపోయింది.
► హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేరు రెండుశాతం నష్టంతో ముగిసింది. నిబంధనలకు విరుద్ధంగా స్టాక్ బ్రోకర్ బీఆర్‌హెచ్ వెల్త్ క్రియేట్స్ తనఖా పెట్టిన సెక్యూరిటీలను అమ్మడంతో సెబీ.., హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుపై రూ.కోటి జరిమానా విధించడం షేరు పతనానికి కారణమైంది.
► క్యూ3 ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం బంధన్ బ్యాంక్ షేరు రెండోరోజూ నష్టాన్ని చవిచూసింది. బీఎస్‌ఈలో ఈ బ్యాంకు షేరు 8 శాతం క్షీణించి రూ.314.2 వద్ద ముగిసింది.
► ఆస్తుల నాణ్యత పెరిగినట్లు క్వార్టర్ ఆర్థిక ఫలితాల్లో వెల్లడి కావడంతో ఎస్‌బీఐ కార్డ్స్ షేరు 5 శాతం లాభంతో ముగిసింది.
► ఇదే మూడో క్వార్టర్‌లో అదిరిపోయే ఆర్థిక ఫలితాలను వెల్లడించిన బజాజ్ షేరు 11 శాతం లాభపడి రూ.4,130 వద్ద స్థిరపడింది.
ఇండిగో పెయింట్స్ ఐపీఓకు భారీ స్పందన
117 రెట్లు సబ్‌స్క్రైబ్షన్‌ను సాధించిన ఇష్యూ
ఇండిగో పెయింట్స్ ఐపీఓకు విశేష స్పందన లభించింది. చివరిరోజు నాటికి ఐపీఓ 117 రెట్ల సబ్‌స్క్రైబ్షన్‌ను సాధించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ మొత్తం 55.18 లక్షల షేర్లను ఆఫర్ చేయగా... 64.58 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. క్యూఐపీ విభాగంలో 189.57 రెట్లు, నాన్–ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కేటగిరీలో 263.05 రెట్లు, రిటైల్ విభాగంలో 15.93 రెట్లు సబ్‌స్క్రైబ్ అయినట్లు ఎక్చ్సేంజీ గణాంకాలు తెలిపాయి. ఇష్యూను పూర్తి చేసుకున్న షేర్లు ఫిబ్రవరి 2న ఎక్చ్సేంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి మంగళవారం కంపెనీ రూ.348 కోట్లను సమీకరించింది.
హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ రెండోరోజుకి 2.2 రెట్ల స్పందన
మార్టిగేజ్ రుణాల సంస్థ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ ఐపీఓ రెండు రోజు ముగిసే సరికి 2.2 రెట్లు సబ్‌స్క్రిబ్షన్ సాధించింది. ఇష్యూ జనవరి 25న ముగియనుంది.
కొత్త ఏడాదిలో అతిపెద్ద పతనం
Published Sat, Jan 23 2021 6:19 AM | Last Updated on Sat, Jan 23 2021 6:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment