
సెప్టెంబర్ చివరివారంలో ప్రపంచ ప్రధాన మార్కెట్లన్నీ ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, లాభాలతో ముగిసాయి. అయినా ఈ హెచ్చుతగ్గులన్నీ ఆగస్టు 31 నుంచి కొనసాగుతున్న పరిమితశ్రేణికి లోబడే వున్నందున, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో పెద్ద కరెక్షన్‌ను ఇప్పట్లో అంచనా వేయలేము. అయితే అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్‌లో జరగనున్న ఎన్నికలపై ఇక నుంచి ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నందున, ఆయా వార్తలకు అనుగుణంగా మార్కెట్లు ఒడిదుడుకులకు లోనుకావొచ్చు. ఇక భారత్ స్టాక్ సూచీల సాంకేతిక అంశాలకొస్తే....
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
గత నాలుగురోజుల ట్రేడింగ్‌వారంలో 38,738 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్, చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 1,308 పాయింట్ల భారీ లాభంతో 38,697 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్ పాజిటివ్‌గా ప్రారంభమైతే 38,990 పాయింట్ల సమీపంలో సెన్సెక్స్‌కు తొలి అవరోధం కలగవచ్చు. ఈ అవరోధస్థాయిని దాటి, ముగిస్తే 39,235–39,560 పాయింట్లశ్రేణి వరకూ పెరగవచ్చు. ఆపైన క్రమేపీ 40,010 పాయింట్ల వరకూ పెరిగే వీలుంటుంది. తొలి నిరోధాన్ని సెన్సెక్స్ అధిగమించలేకపోయినా, బలహీనంగా ప్రారంభమైనా 38,240 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన 37,830 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ మద్దతును సైతం వదులుకుంటే 37,545 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు.
నిఫ్టీ తక్షణ నిరోధం 11,535
గతవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,428 పాయింట్ల గరిష్టస్థాయిని తాకిన తర్వాత, చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 367 పాయింట్ల లాభంతో11,417 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్ పెరిగితే, 11,535 పాయింట్ల వద్ద నిఫ్టీకి తొలి అవరోధం కలగవచ్చు. అటుపైన ముగిస్తే 11,590–11620 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఈ శ్రేణిని దాటితే తిరిగి 11,795 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం నిఫ్టీ తొలి నిరోధాన్ని దాటలేకపోతే 11,295 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే వేగంగా 11,185 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఈ లోపున 11,100 పాయింట్ల వద్ద ముఖ్యమైన మద్దతు లభిస్తున్నది.
– పి. సత్యప్రసాద్