
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 113 పాయింట్లు బలపడి 39,014 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 31 పాయింట్లు పుంజుకుని 11,501 వద్ద కదులుతోంది. సోమవారంనాటి భారీ పతనం నుంచి మార్కెట్లు మంగళవారం కోలుకున్నప్పటికీ తీవ్ర ఆటుపోట్లను చవిచూసిన సంగతి తెలిసిందే. మంగళవారం అమెరికా ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను అందుకోగా.. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,030 వద్ద గరిష్టాన్ని తాకగా.. 38,818 వద్ద కనిష్టానికీ చేరడం గమనార్హం!
ఐటీ అప్
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ, మెటల్, ఎఫ్‌ఎంసీజీ 0.5 శాతం చొప్పున పుంజుకోగా.. బ్యాంకింగ్, ఆటో, రియల్టీ, మీడియా అదే స్థాయిలో డీలా పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్‌ఫ్రాటెల్, జీ, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, అల్ట్రాటెక్, విప్రో, శ్రీసిమెంట్, బ్రిటానియా, ఐటీసీ, టెక్ మహీంద్రా, సిప్లా, ఐవోసీ, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్ 4-0.75 శాతం మధ్య ఎగశాయి. అయితే బజాజ్ ఆటో, కొటక్ బ్యాంక్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, గ్రాసిమ్, ఇండస్‌ఇండ్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్, ఎంఅండ్‌ఎం, టైటన్, యూపీఎల్ 1.4-0.6 శాతం మధ్య డీలాపడ్దాయి.
ఐడియా జోరు
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో ఐడియా 10 శాతం దూసుకెళ్లగా.. మైండ్‌ట్రీ, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్, బెర్జర్ పెయింట్స్, టొరంట్ ఫార్మా, ఎంజీఎల్, టాటా కెమికల్స్, ఎన్‌ఎండీసీ, ఎస్కార్ట్స్, ఇండిగో 4.6-1.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క భారత్ ఫోర్జ్, బాలకృష్ణ, పీవీఆర్, పిరమల్, పీఎఫ్‌సీ, టీవీఎస్ మోటార్, జూబిలెంట్ ఫుడ్, అమరరాజా 3.5-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం బలపడింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1101 లాభపడగా.. 507 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి.