దేశీ స్టాక్ మార్కెట్లు నేడు(4న) పతనం(గ్యాప్‌డౌన్)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 128 పాయింట్లు కోల్పోయి 11,422 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ 11,550 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ప్రధానంగా టెక్ దిగ్గజాలలో వెల్లువెత్తిన అమ్మకాలతో గురువారం యూఎస్ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలనుంచి కుప్పకూలాయి. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లలోనూ అమ్మకాలదే పైచేయిగా నిలుస్తోంది. జీడీపీ పతనం, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాల నేపథ్యంలో మూడు రోజులుగా ఆటుపోట్ల మధ్య కదులుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు నేడు మరోసారి బలహీనంగా కదలవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
లాభాలతో మొదలై
గురువారం తొలుత హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి యధాప్రకారం ఆటుపోట్లకు లోనయ్యాయి. చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 95 పాయింట్లు క్షీణించి 38,991 వద్ద నిలవగా.. నిఫ్టీ 8 పాయింట్లు తక్కువగా 11,527 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,236- 38,943 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నిఫ్టీ సైతం 11,585 వద్ద గరిష్టాన్ని తాకగా.. 11,508 దిగువన కనిష్టానికి చేరింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,475 పాయింట్ల వద్ద, తదుపరి 11,423 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,573 పాయింట్ల వద్ద, ఆపై 11,617 వద్ద నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 23,304 పాయింట్ల వద్ద, తదుపరి 23,078 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 23,904 పాయింట్ల వద్ద, తదుపరి 24,278 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ కనిపించవచ్చని భావిస్తున్నారు.
ఎఫ్‌పీఐలు సైలెంట్
గురువారం నగదు విభాగంలో ఇటు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నామమాత్రంగా రూ. 8 కోట్లు, అటు దేశీ ఫండ్స్(డీఐఐలు) స్వల్పంగా రూ. 120 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! బుధవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 991 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 657 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment