Series Of Problems Arise Over Electric Vehicles Charging Issue - Sakshi
Sakshi News home page

కిచెన్‌లో ఈవీ స్కూటర్! కారణమేంటీ?

Published Sun, Sep 12 2021 11:53 AM | Last Updated on Sun, Sep 12 2021 5:31 PM

Series Of Problems Arise Over Electric Vehicles Charging Issue - Sakshi

ఎవరింట్లో అయినా కిచెన్‌ అంటే వంట పాత్రలు, గ్యాస్‌స్టవ్‌, మిక్సీ, మైక్రో ఓవెన్లు, పొపుల పెట్టె లాంటి వస్తువులు ఉంటాయి. కానీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ భాస్కర్‌ ఇంట్లో రాత్రయితే చాలు స్కూటర్‌ వచ్చి చేరుతుంది. వంటింట్లో స్కూటర్‌తో పనేంటి ? ప్రతీ రోజు రాత్రి అదక్కడికి ఎందుకు వస్తుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియా, ఎలక్ట్రిక్‌ వెహికల్‌ హాబ్‌ ఆఫ్‌ ఇండియాగా పేరు తెచ్చుకున్న బెంగళూరు నివాసి భాస్కర్‌. పెరుగుతున్న పెట్రోలు ధరల భారం మోయలేక ఇటీవలే ముచ్చపడి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొనుగోలు చేశాడు. అయితే పెట్రోలు బాధలు తప్పినా ఇరుగుపొరుగుకు శత్రువయ్యాడు. వంటిల్లులోకి స్కూటర్‌ తేవడంతో ఆఖరికి సొంతింట్లో కూడా మద్దతు సంపాదించలేని స్థితికి చేరుకున్నాడు. ఇలాంటి ఒక్క భాస్కర్‌కే కాదు నగరాల్లో నివాసం ఉంటూ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ కొనుగోలు చేసిన చాలా మంది పరిస్థితి భాస్కర్‌లాగే మారింది. 

ఎక్కడ ఛార్జ్‌ చేయాలి
ఎలక్ట్రిక్‌ వెహికల్‌ కొంటున్న వారిలో ఎక్కువ మంది అపార్ట్‌మెంట్లలోనే నివాసం ఉంటున్నారు. మన దగ్గరున్న నూటికి 99 శాతం అపార్ట్‌మెంట్లలో ఛార్జింగ్‌ పాయింట్లు లేవు. దీంతో వాహనం కొనుగోలు చేసిన వారు దాన్ని ఛార్జింగ్‌ పెట్టుకునేందుకు నానా ఆగచాట్లు పడుతున్నారు. 

- అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న అన్ని కుటుంబాలు ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌కి ఇంకా మారలేదు.

- ఎలక్ట్రిక్‌ వెహికల్‌కి మారిన వారు అపార్ట్‌మెంట్‌లో ఛార్జింగ్‌ పాయింట్‌ పెట్టుకుంటామంటే మిగిలిన వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

- ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ పాయింట్‌ ఏర్పాటు చేస్తే దానికి వచ్చే కరెంటు బిల్లు ఎవరు భరించాలి ? ఆ ఛార్జింగ్‌ పాయింట్‌ని సురక్షితంగా ఎవరు మెయింటైన్‌ చేయాలనేది సమస్యగా మారింది.

- ఛార్జింగ్‌ పాయింట్లు పేలిపోతాయనే అపోహలు ఇంకా జనాల్లో ఉన్నాయి. దీంతో ఛార్జింగ్‌పాయింట్‌ ఏర్పాటుకు ససేమిరా అంటున్నారు.

ఏర్పాటు కూడా కష్టమే
ఇక అపార్ట్‌మెంటులో ఉన్న వాళ్లందరినీ ఒప్పించి ఛార్జింగ్‌ పాయింట్‌ ఏర్పాటు చేసుకోవాలంటే విద్యుత్‌ శాఖ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది.

- ఛార్జింగ్‌ పాయింట్‌కి ప్రత్యేకంగా మీటరు ఏర్పాటు చేసుకోవాలి. దీని కోసం విద్యుత్‌ డిస్కంలకు దరఖాస్తు చేయాలి.

- ఇటీవల బెంగళూరుకి చెందిన నరేశ్‌ ఇలా కొత్తగా పాయింట్‌ ఏర్పాటు చేసుకుంటే ఈవీ ఛార్జింగ్‌ ఎక్వీప్‌మెంట్‌కి రూ. 2000ల ఖర్చు వస్తే విద్యుత్‌ శాఖ వారు వైరు లాగేందుకే రూ. 11,000 వసూలు చేశారు. 

- ఈవీ ఛార్జింగ్‌ పాయింట్ల ఏర్పాటుకు సంబంధించి విద్యుత్‌ సం‍స్థలకు ఓ విధానమంటూ లేదు. పై నుంచి ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి గైడ్‌లైన్స్‌ లేవు. దీంతో ఈవీ ఛార్జింగ్‌ పాయింట్ల విషయంలో విద్యుత్‌శాఖ స్పందన అంతంత మాత్రంగానే ఉంది.

తప్పని తిప్పలు
కాలుష్యాన్ని తగ్గించాలంటూ ఓ వైపు ప్రభుత్వ విధానాలు, మరోవైపు పెరిగిపోతున్న పెట్రోలు ధరల ఎఫెక్ట్‌తో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్‌ పెరిగిపోతుంది. అయితే ఈవీకి మారాలంటూ ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం, అందుకు తగ్గ పరిస్థితులు సృష్టించడంలో విఫలం అవుతోంది. దీంతో అపార్ట్‌మెంట్‌లలో నివాసం ఉండేవారు ఛార్జింగ్‌ పాయింట్ల కోసం తోటి వారితో పోరాటం చేయాల్సి వస్తోంది. లేదంటే ఇంటి వంట గదిలోకి తీసుకెళ్లి ఛార్జింగ్‌ పెట్టుకోవాల్సి వస్తోంది.

మా సమస్య పరిష్కరించండి
అపార్ట్‌మెంట్లలో ఛార్జింగ్‌ పాయింట్లకు అనుమతి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానాల్లో అర్జీలు నమోదు అవుతున్నాయి. ఈవీ ఛార్జింగ్‌ పాయింట్లకు అడ్డుపడుతున్న అపార్ట్‌మెంట్‌​ రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేన్స్‌ అభ్యంతరాలను కొట్టేయాలంటూ న్యాయస్థానాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. బెంగళూరు సివిల్‌ కోర్టులో ఇప్పటికే రెండు వేల మంది సంతకాలతో కూడిన పిటిషన్‌ విచారణలో ఉంది.

సమగ్ర విధానమేదీ?
ఈవీ తయారీ, అమ్మకాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చూపెడుతున్న శ్రద్ధ వాటి మెయింటెన్స్‌ విధానాలపై కూడా చూపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. అపార్ట్‌మెంట్లలో ఛార్జింగ్‌ పాయింట్లను చేర్చడం, కొత్త కనెక‌్షన్‌ విషయంలో విద్యుత్‌ సంస్థలకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు కొత్తగా వచ్చే ఇళ్లలో ఈవీ ఛార్జింగ్‌ పాయింట్ల ఏర్పాటు, మెయింటనెన్స్‌ను తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలు అమల్లోకి తేవాలని డిమాండ్‌ చేస్తున్నారు.
చదవండి: Yamaha: ఫెస్టివల్‌ ఆఫర్‌, ఈ బైక్‌ కొంటే లక్ష వరకు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement