ముంబై: నేడు (13న) దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నేలచూపులతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 37 పాయింట్లు క్షీణించి 12,667 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ నవంబర్ ఫ్యూచర్స్ 12,704 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. రోజుకి లక్ష దాటుతున్న కరోనా కేసులు, ప్యాకేజీపై అనిశ్చితి నేపథ్యంలో గురువారం యూఎస్ మార్కెట్లు 1 శాతం నష్టాలతో ముగిశాయి. ప్రస్తుతం ఆసియాలోనూ మార్కెట్లు నీరసంగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా నేడు మరోసారి మార్కెట్లు బలహీనంగా కదిలే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. చదవండి:(సూపర్ ర్యాలీకి బ్రేక్- బ్యాంక్స్ బోర్లా)
సూపర్ ర్యాలీకి బ్రేక్
చిట్టచివరికి గురువారం 8 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో మార్కెట్ల సూపర్ ర్యాలీకి బ్రేక్ పడింది. సెన్సెక్స్ 236 పాయింట్లు క్షీణించి 43,357 వద్ద ముగిసింది. నిఫ్టీ 58 పాయింట్లు క్షీణించి 12,691 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 43,544 పాయింట్ల వద్ద గరిష్టానికి చేరగా.. 43,128 దిగువన కనిష్టాన్నీ తాకింది. నిఫ్టీ సైతం 12,741- 12,625 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,630 పాయింట్ల వద్ద, తదుపరి 12,569 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 12,746 పాయింట్ల వద్ద, ఆపై 12,802 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ కనిపించవచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 28,006 పాయింట్ల వద్ద, తదుపరి 27,732 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 28,612 పాయింట్ల వద్ద, తదుపరి 28,946 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు.
ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1514 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,239 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 6,207 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 3,464 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment