
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సెప్టెంబర్ నెలకు లాభాలతో వీడ్కోలు పలికాయి. ఇటీవల పతనంలో భాగంగా కనిష్ట స్థాయిలకు దిగివచ్చిన ఇంధన, మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల షేర్లలో వాల్యూ బైయింగ్ సూచీలను లాభాల బాట పట్టించింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల రికవరీ కలిసొచ్చింది. ఉదయం సానుకూలంగా మొదలైన సూచీలు ట్రేడింగ్‌లో అధిక భాగం లాభాల్లో ట్రేడయ్యాయి.
అయితే శని, ఆది, సోమవారాలు ఎక్ఛేంజీలకు సెలవు కావడంతో ఇన్వెస్టర్ల ఆఖర్లో అప్రమత్తత వహిస్తూ కొంత లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా సెన్సెక్స్ 320 పాయింట్లు పెరిగి 65,828 వద్ద స్థిరపడింది. ఒక దశలో 643 పాయింట్లు లాభపడి 66,152 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 115 పాయింట్లు బలపడి 19,638 వద్ద నిలిచింది. ఒక్క ఐటీ మినహా అన్ని రంగాల షేర్లు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్‌ఈ మిడ్ క్యాప్, స్మాల్ సూచీలు వరుసగా 1.31%, 0.57 శాతం చొప్పున రాణించాయి.
విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,686 కోట్ల షేర్లను అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,751 కోట్ల షేర్లను కొన్నారు. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 181 పాయింట్లు, నిఫ్టీ 36 పాయింట్లు నష్టపోయాయి. యూరోజోన్, అమెరికా సెప్టెంబర్ ద్రవ్యోల్బణ అంచనాలకు తగ్గట్లే దిగిరావడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు రికవరీ బాటపట్టాయి.
మార్కెట్లో మరిన్ని సంగతులు
♦ఇంధన రంగ షేర్లైన రిలయన్స్ (0.50%), ఓఎన్‌జీసీ (2%), ఎన్‌టీపీసీ (3.50%), ఐఓసీఎల్ (1.28%), గెయిల్ (2.50%), బీపీసీఎల్ (1%), ఎన్‌హెచ్‌పీసీ (2%), హెచ్‌పీసీఎల్ (2%), పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ (2%), ఇంద్రప్రస్థ గ్యాస్ (1%) రాణించాయి.
♦ఎంసీఎక్స్ వచ్చే వారం(అక్టోబర్ 3) నుంచి ప్రారంభించాలనుకున్న కొత్త కమోడిటీ డెరివేటివ్స్ ప్లాట్‌ఫామ్ లైవ్ ట్రేడింగ్‌ని వాయిదా వేయాలని సెబీ కోరడంతో షేరు 2.50% నష్టపోయి రూ.2049 వద్ద స్థిరపడింది.
♦లాభాల మార్కెట్లోనూ ఐటీ షేర్లు నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ ఐటీ సేవల దిగ్గజం యాక్సెంచర్ తన వార్షిక, తొలి త్రైమాసిక ఆదాయ అంచనాలను తగ్గించుకోవడంతో దేశీయ ఐటీ షేర్లపై అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఎల్‌టీఐఎం, ఎల్‌టీటీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు 3–1% పతనమయ్యాయి. కోఫోర్జ్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు అరశాతం వరకు నష్టపోయాయి.
♦ఇటీవల వరుస నష్టాలు చవిచూస్తున్న ఫార్మా షేర్లు లాభాల బాటపట్టాయి. అత్యధికంగా గ్లెన్‌మార్క్ ఫార్మా 10% ర్యాలీ చేసింది. అరబిందో ఫార్మా 5%, గ్రాన్యూల్స్ 4% లాభపడ్డాయి. లుపిన్, డాక్టర్ రెడ్డీస్, ఆల్కేమ్, సన్‌ఫార్మా, సిప్లా, బయోకాన్ లారస్ ల్యాబ్స్ షేర్లు 3–1% చొప్పున పెరిగాయి. రంగాల వారీగా బీఎస్‌ఈలో అత్యధికంగా ఫార్మా ఇండెక్స్ 2.60% ర్యాలీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment