న్యూఢిల్లీ: శ్రీరామ్ ప్రాపర్టీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల విక్రయాల (బుకింగ్‌లు) పరంగా 25 శాతం వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ఉంది. ఈ విషయాన్ని సంస్థ చైర్మన్, ఎండీ ఎం.మురళి ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంలో (2022–23) ఇళ్ల విక్రయ బుకింగ్‌ల ద్వారా రికార్డు స్థాయిలో రూ.1,846 కోట్ల ఆదాయం నమోదు చేసింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికం.
2021–22లో విక్రయాల ఆదాయం రూ.1,482 కోట్లతో పోలిస్తే 25 శాతం వృద్ధి నమోదైనట్టు మురళి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంఖ్యా పరంగా 20 శాతం, విలువ పరంగా 25 శాతం వృద్ధిని సాధించాలని అనుకుంటున్నట్టు వెల్లడించారు. 2021–22లో ఈ సంస్థ 3.8 మిలియన్ చదరపు అడుగుల మేర విక్రయాలు చేయగా, 2022–23లో 4.02 మిలియన్ చదరపు అడుగుల అమ్మకాలను సాధించింది. పెరుగుతున్న ఇళ్ల డిమాండ్‌కు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్టు మురళి తెలిపారు. ‘‘మార్కెట్ ఎంతో అనుకూలంగా ఉంది.
మధ్యస్థ, అందుబాటు ధరల ఇళ్లకు మించి డిమాండ్ నెలకొంది. పలు అంశాల కారణంగా వచ్చే 3–5 ఏళ్లపాటు డిమాండ్ కొసాగుతుందని అంచనా’’అని మురళి వివరించారు. ఇతర రంగాల్లో స్థిరమైన వృద్ధి కారణంగా రియల్ ఎస్టేట్‌లోనూ వృద్ధికి మద్దతుగా నిలుస్తున్నట్టు చెప్పారు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే శ్రీరామ్ ప్రాపర్టీస్ 2021 డిసెంబర్‌లో స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో లిస్ట్ అవయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ లాభం నాలుగు రెట్లు పెరిగి రూ.68 కోట్లకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment