ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఓవైపు సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఇండియా.. మరోపక్క చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కౌంటర్లు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కంపెనీల షేర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
ఎస్‌ఐఎస్ ఇండియా లిమిటెడ్
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఎస్‌ఐఎస్ ఇండియా లిమిటెడ్ నికర లాభం 42 శాతం జంప్‌చేసి రూ. 108 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 33 శాతం పెరిగి రూ. 2,158 కోట్లను తాకింది. పటిష్ట క్యాష్‌ఫ్లో కారణంగా ఈ కాలంలో రూ. 213 కోట్లమేర రుణాలను తిరిగి చెల్లించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎస్‌ఐఎస్ షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 14 శాతం దూసుకెళ్లి రూ. 404కు చేరింది. ప్రస్తుతం 7.2 శాతం లాభంతో రూ. 381 వద్ద ట్రేడవుతోంది.
చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ నికర లాభం 41 శాతం జంప్‌చేసి రూ. 432 కోట్లకు చేరింది. ఇందుకు బలపడ్డ నికర వడ్డీ మార్జిన్లు, నిర్వహణ వ్యయాలు తగ్గడం సహకరించినట్లు తెలియజేసింది. ఆస్తుల నాణ్యతకు సంబంధించి స్టేజ్-3 రుణాలు 2.75 శాతంగా నమోదుకాగా.. ప్రొవిజన్ కవరేజీ నిష్పత్తి 42.65కు చేరినట్లు పేర్కొంది. ప్రాపర్టీలపై రుణాల బిజినెస్ నామమాత్రంగా క్షీణించి రూ. 1,052 కోట్లను తాకింది. రూ. 6,802 కోట్ల నగదు నిల్వల ద్వారా పటిష్ట లిక్విడిటీని కలిగి ఉన్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో చోళమండలం షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 9 శాతం దూసుకెళ్లి రూ. 273 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment