చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు... కళకళ! | Small finance banks in foucs | Sakshi
Sakshi News home page

చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు... కళకళ!

Published Fri, Jan 8 2021 9:19 AM | Last Updated on Fri, Jan 8 2021 9:52 AM

Small finance banks in foucs - Sakshi

ముంబై: తానిచ్చే రుణాలపై రిటర్న్స్, తన వద్ద డిపాజిట్లపై చెల్లించే వడ్డీల విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో పోల్చితే చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు (ఎస్‌ఎఫ్‌బీ) ఎంతో మెరుగైన స్థితిలో ఉన్నాయి. రుణ నాణ్యత విషయంలోనూ వాటికి అవే సాటిగా కొనసాగుతున్నాయి. క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ– కేర్‌ రేటింగ్స్‌ విడుదల చేసిన ఒక విశ్లేషణాత్మక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... 

-తానిచ్చే రుణాలపై 19.87 శాతం రిటర్న్స్‌ను చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు పొందుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో ఈ రేటు 8.16 శాతంగా ఉంది. ప్రైవేటు రంగ బ్యాంకులు 10.10 శాతం రిటర్న్స్‌ పొందుతుండగా, ఫారిన్‌ బ్యాంకింగ్‌కు 8.45 శాతం వడ్డీ వస్తోంది.  
-నిధుల సమీకరణ వ్యయం మాత్రం చిన్న ఫైనాన్స్‌ బ్యాంకుల విషయంలో అత్యధికంగా 8.66 శాతంగా ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులపై నిధుల సమీకరణ భారం 4.92 శాతంగా ఉంటే, ప్రైవేటు, విదేశీ బ్యాంకుల విషయంలో ఈ వడ్డీరేట్లు వరుసగా 5.41 శాతం, 3.73 శాతాలుగా ఉన్నాయి.  
-ఒక్క డిపాజిట్లపై ఎస్‌ఎఫ్‌బీలు చెల్లించే  వడ్డీ 8.20 శాతం. ఈ విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 4.96 శాతం వడ్డీని చెల్లిస్తుండగా,  ప్రైవేటు రంగ బ్యాంకులు 5.26 శాతం ఇస్తున్నాయి. ఫారిన్‌ బ్యాంకుల విషయంలో మరీ తక్కువగా 3.65 శాతంగా ఉంది.  
-ఒక్క అసెట్స్‌ చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులకు రిటర్న్స్‌ మైనస్‌ 0.23 శాతంగా ఉంది. ప్రైవేటు బ్యాంకింగ్‌ విషయంలో ఇది 0.51 శాతం ఉంటే, ఎస్‌ఎఫ్‌బీలు మాత్రం అత్యధికంగా 1.70 శాతం రిటరŠస్న్‌ ఉన్నాయి. మల్టీ నేషనల్‌ కంపెనీ రుణదాతలు 1.55 శాతం రిటర్న్స్‌ పొందుతున్నారు. నగదు, ప్రభుత్వ బాండ్లు, తనఖాలు, లెటర్స్‌ ఆఫ్‌ క్రెడిట్, ఇంటర్‌ బ్యాంక్‌ రుణాలు అసెట్స్‌ విభాగం  లోకి వస్తాయి.  
-ఈక్విటీ ఆదాయాలపై చెల్లింపుల విషయానికి వస్తే,  15 శాతంతో చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు మంచి పనితీరును ప్రదర్శిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు మైనస్‌ 4.16 శాతంతో ఉంటే, ప్రైవేటు బ్యాంకింగ్‌ ఆదాయం 3.30 శాతంగా ఉంది. ఫారిన్స్‌ బ్యాంకింగ్‌ తమ ఇన్వెస్టర్లకు 8.76 శాతం చెల్లిస్తోంది.  
-చిన్న ఫైనాన్స్‌ బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్ల విలువ 2019–20 ఆర్థిక సంవత్సరంలో 8.34 శాతం. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, ఫారిన్‌ బ్యాంకుల విషయంలో ఈ శాతాలు వరుసగా 2.27 శాతం, 3.42 శాతం, 3.26 శాతాలుగా ఉన్నాయి.  
-బ్యాంకింగ్‌ ప్రమాణాల విషయంలోనూ ఇవి మెరుగైన స్థానంలో ఉన్నాయి. క్యాపిటల్‌ అడిక్వెసీ రేషియో 20.2 శాతంగా ఉంటే, ఎన్‌పీఏల భారం 1.9 శాతంగా ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, ఫారిన్‌ బ్యాంకుల విషయంలో క్యాపిటల్‌ అడిక్వెసీ వరుసగా 12.9 శాతం, 16.5 శాతం, 17.7 శాతంగా ఉన్నాయి. ఇక ఎన్‌పీఏల విషయంలో ఈ రేట్లు వరుసగా 10.3 శాతం, 5.5 శాతం, 2.3 శాతాలుగా ఉన్నాయి.  

10 ఎస్‌ఎఫ్‌బీల క్రియాశీలక పాత్ర 
2016 తరువాత 10 చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు దేశంలో క్రియాశీలంగా పనిచేస్తున్నాయి. రుణ లభ్యత సరిగా లేని రంగాలకు అలాగే చిన్న వ్యాపారాలు, రైతులకు సకాలంలో తగిన రుణ సౌలభ్యత కల్పించడం లక్ష్యంగా చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు పనిచేస్తున్నాయి. ఈ 10 ఎస్‌ఎఫ్‌బీల మొత్తం బ్యాలెన్స్‌ షీట్‌ 2019–20 ఆర్థిక సంవత్సరానికి 1.33 లక్షల కోట్లు. మొత్తం బ్యాంకింగ్‌ వ్యవస్థలో వీటి వాటా 0.7 శాతం. ఈ విషయంలో ఒక్క 2019–20 ఆర్థిక సంవత్సరంలో 58 శాతం వృద్ధి రేటు నమోదుకావడం గమనార్హం. మొత్తం బ్యాంకింగ్‌ బ్యాలెన్స్‌ షీట్‌లో వృద్ధి 8.5 శాతం మాత్రమే. ఇక మొత్తం  1.33 లక్షల కోట్ల బ్యాలెన్స్‌ షీట్‌లో రూ.5,151 కోట్లు మూలధనం. రూ.11,047 కోట్లు నిల్వలు. డిపాజిట్లు రూ.82,488 కోట్లు. వీటిలో టర్మ్‌ డిపాజిట్ల విలువ రూ.69,823 కోట్లు. రిటర్న్స్, చెల్లించే వడ్డీల విషయంలో అధిక ధర ఎందుకు ఉందన్న అంశాన్ని కూడా నివేదిక వివరించింది. ఈ బ్యాంకుల మొత్తం డిపాజిట్లలో 60 శాతం ఏడాదికన్నా తక్కువ కాలానికి సంబంధించినవే. ఒకటి నుంచి మూడేళ్ల మధ్య డిపాజిట్లు 37.5 శాతంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో ఇందుకు సంబంధించి శాతాలు వరుసగా 40.4 శాతం, 22.8 శాతాలుగా ఉన్నాయి. ఇక ఇచ్చే రుణాల విషయంలో ఏడాది కన్నా తక్కువ కాలానికి సంబంధించిన రుణాలు 38.1 శాతం. 1 నుంచి మూడేళ్ల మధ్య రుణాలు 42.4 శాతంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో ఇవి వరుసగా 25.2 శాతం, 40.3 శాతాలుగా ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement