న్యూఢిల్లీ: ఐపీవోకు రావాలనుకుంటున్న 10 యూనికార్న్‌లతో జేపీ మోర్గాన్, జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంకు ఇటీవల సమావేశాన్ని నిర్వహించాయి. బెంగళూరులో ఈ నెల 3, 4వ తేదీల్లో ఇది జరిగింది. వచ్చే మూడేళ్లలో ఐపీవోకు వచ్చే సన్నాహాలతో ఉన్న స్విగ్గీ, అన్‌అకాడమీ తదితర యూనికార్న్‌లతోపాటు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు సైతం ఇందులో పాల్గొన్నాయి.
మామాఎర్త్, లెన్స్‌కార్ట్, అకో, మీషో, ఎలాస్టిక్‌రన్, ఇన్‌మొబి సైతం ఇందులో పాల్గొన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, యూటీఐ తదితర 14 దేశీయ మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు సైతం పాలు పంచుకున్నాయి. పబ్లిక్ మార్కెట్ ఇన్వెస్టర్లను యూనికార్న్‌లు మెరుగ్గా అర్థం చేసుకునేందుకు, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు, యూనికార్న్‌ల మధ్య మెరుగైన సమాచార సంప్రదింపులకు వీలుగా ఈ సమావేశం నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గతేడాది వచ్చిన పేటీఎం, జొమాటో సెకండరీ మార్కెట్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment