వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇదే నిజం. ఒకరికి కింద భయపడుతూ పని చేయడం కంటే సొంత వ్యాపారం మేలనుకున్నాడో గ్రాడ్యుయేట్. చీటికి మాటికి బాసులు పెట్టే టార్చర్లు భరించడం కంటే జంతువులతో మసలుకోవడం మేలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా తాను చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పారు. ఫార్మ్‌హౌస్ బాట పట్టాడు. ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నాడు.
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా బెంగళూరుకు పేరు. ఒక్క కర్నాటక యువతనే కాదు దేశం నలుమూలల నుంచి ఉద్యోగ అవకాశాల కోసం యువతరం బెంగళూరు వైపు చూస్తూ ఉంటుంది. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ఆధారంగా అనేక స్టార్టప్‌లు పుట్టుకు వచ్చి యూనికార్న్ కంపెనీలుగా ఎదిగిన ఘనత కూడా ఈ నగరానికే సొంతం. అలాంటి బెంగళూరు నగరం వీడిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు పల్లెబాట పట్టాడు. గాడిదలు పెంచుకుంటూ లక్షలు కూడబెడుతున్నాడు.
సాఫ్ట్‌వేర్ వదిలి
శ్రీనివాస గౌడ్ అందరిలాగే గ్రాడ్యుయేష్ పూర్తి చేశాడు. సాఫ్ట్‌వేర్ కలలతో బెంగళూరులో వాలిపోయాడు. మార్కెట్ డిమాండ్‌కు తగ్గ కోర్సులు నేర్చుకుని కంప్యూటర్ ముందు వాలిపోయాడు. కానీ ఒకరి కింద పని చేయడంలో ఉండే అసంతృప్తి అతన్ని వేధించాయి. తన మనసుకు నచ్చిన పని చేయాలని డిసైడ్ అయ్యాడు.
కడక్‌తో మొదలు
కోవిడ్ కల్లోలం 2020లో ప్రపంచాన్ని పలకరించింది. బెంగళూరు వీడి దక్షిణ కన్నడ జిల్లాలోని సొంతూరైన ఐరాకు చేరుకున్నాడు. అప్పుడే తెలిసింది తన మనసు ఏం కోరుతుందో. వెంటనే జాబ్‌కు రిజైన్ చేశాడు. ఇంటి దగ్గరున్న రెండున్నర ఎకరాల స్థలంలో కడక్‌నాథ్ కోళ్లు, కుందేళ్ల పెంపకం ప్రారంభించాడు. కంప్యూటర్ ముందు కాలు కదపకుండా పని చేయాలనే భావనలో యువత ఉంటే, చిత్రంగా కోళ్లు, కుందేళ్లు అంటూ పరితపించే శ్రీనివాస్‌ను అంతా వింతగా చూశారు.
గాడిదల కోసం
రెండేళ్లు గడిచిన తర్వాత మార్కెట్ మరింతగా అర్థమైంది శ్రీనివాస్‌కి. అప్పుడు అతను తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా అతని పేరు వెలుగులోకి రావడానికి కారణమైంది. ఎవ్వరి ఊహకు అందని విధంగా గాడిదల ఫామ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. మేలురకం గాడిదల కోసం అన్వేషణ ప్రారంభించాడు. ఓ రేంజ్ వరకు కోళ్లు, కుందేళ్లు ఒకే కానీ ఈ గాడిదల పెంపకం ఏంటి? పిచ్చేమైనా పట్టిందా అన్నట్టుగా చూశారు అంతా.
మార్కెటింగ్
కర్నాటక అంతా గాలించి చివరకు 20 గాడిదలు సాధించి వాటితో ఫామ్ ఏర్పాటు చేశాడు. అక్కడి నుంచి గాడిద పాలు మార్కెటింగ్ చేయడం కోసం బెంగళూరుతో పాటు కర్నాటకలో ఉన్న ఇతర నగరాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈసారి అతనికి నిరాశ ఎదురు కాలేదు. ఊహించినదాని కంటే అనేక రెట్లు అధికంగా రెస్పాన్స్ వచ్చింది. మాకు కావాలంటే మాకు కావాలంటూ బయ్యర్లు ఎగబడ్డారు.
నా అంచనా నిజమైంది - శ్రీనివాసగౌడ
గాడిద పాలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇప్పటికీ చిన్న పిల్లల్లో ఉబ్బసం వ్యాధికి ఔషధంగా గాడిద పాలు పట్టిస్తారు. అయితే ఆ రోజుల్లో ఊళ్లలో రజకల దగ్గర గాడిదలు ఉండేవి. బరువులు మోసే పనులకు వీటిని ఉపయోగించేవారు. కానీ మెషినరీ పెరిగిపోయిన తర్వాత అన్ని చోట్ల గాడిదల సంతతి తగ్గిపోతుంది. గాడిద పాలు దొరకం లేదనే విషయం గమనించాను. అందుకే గాడిదలో ఫామ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నా. అప్పుడందరూ నన్నో పిచ్చోడిలా చూశారు. కానీ ఫామ్ ఏర్పాటు చేసిన ఆరు నెలలకే నాకు రూ. 17 లక్షల విలువైన ఆర్డర్లు వచ్చాయి. ఇవి సప్లై చేయడమే కష్టంగా ఉంది. ఇంకా డిమాండ్ కూడా పెరుగుతోంది.
చదవండి: సంపద సృష్టిలో అదానీ అదరహో
Comments
Please login to add a commentAdd a comment