న్యూఢిల్లీ: భారత్ 2022–23 వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– స్టాండెర్డ్ అండ్ పూర్ (ఎస్‌అండ్‌పీ) కుదించింది. క్రితం (సెప్టెంబర్ నాటి) 7.3 శాతం అంచనాలను 7 శాతానికి కుదిస్తున్నట్లు తెలిపింది. అయితే దేశీయంగా పటిష్టంగా ఉన్న డిమాండ్ పరిస్థితులు ఎకానమీని అంతర్జాతీయ ప్రతికూలతలను తట్టుకుని నిలబడేలా చేస్తున్నట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ ఆసియా–పసిఫిక్ చీఫ్ ఎకనమిస్ట్ లూయీస్ క్యూజియెస్ విశ్లేషించారు.
ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి సెప్టెంబర్ 6.5 శాతం అంచనాను తాజాగా 6 శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2022–23లో సగటును 6.8 శాతంగా ఉంటుందని, 2023 మార్చి నాటికి ఆర్‌బీఐ కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై సెంట్రల్ బ్యాంక్ వసూలు చేసే వడ్డీరేటు (ప్రస్తుతం 5.9 శాతం) 6.25 శాతానికి చేరుతుందని ఎస్‌అండ్‌పీ భావిస్తోంది.
ద్రవ్యోల్బణం లక్ష్యంగా ఆర్‌బీఐ మే నుంచి రెపో రేటును నాలుగు దఫాల్లో 1.9 శాతం పెంచింది. దీనితో ఈ రేటు మూడేళ్ల గరిష్టానికి చేరింది. తాజా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ)సహా పలు దేశీయ, అంతర్జాతీయ బ్యాంకింగ్, ఆర్థిక, వాణిజ్య దిగ్గజ సంస్థలు 2022–23 భారత్ తొలి వృద్ధి అంచనాలకు కోత పెడుతున్న సంగతి తెలిసిందే. 6.5 శాతం నుంచి 7.3 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందన్నది ఆయా అంచనాల సారాంశం.
Comments
Please login to add a commentAdd a comment