ముంబై: దేశీయంగా స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసే వార్తలేవీ లేకపోవడంతో ఈ వారం సూచీల కదలికలకు అంతర్జాతీయ పరిణామాలే కీలకమని విశ్లేషకులు చెబుతున్నారు. కార్పొరేట్ కంపెనీలు జూన్ త్రైమాసిక ఫలితాల ప్రకటన ఘట్టాన్ని దాదాపు పూర్తి చేశాయి. ఆయా రాష్ట్రాల కోవిడ్ కర్ఫ్యూ సడలింపులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ, కోవిడ్ మూడో వేవ్ విస్తరణ అంశాలపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించున్నాయి. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలు మార్కెట్లకు కీలకంగా మారనున్నాయి. మొహర్రం సందర్భంగా గురువారం(ఆగస్ట్ 19న) ఎక్స్ఛేంజ్‌లకు సెలవు కావడంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగురోజులకే పరిమితంకానుంది.
‘‘జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలతో మార్కెట్‌లో దీర్ఘకాలం పాటు బుల్లిష్ ట్రెండ్ కొనసాగవచ్చు. ఇదే సమయంలో సూచీల రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణతో చిన్నపాటి దిద్దుబాటుకు అవకాశం లేకపోలేదు. రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో మూడునెలల కనిష్టానికి దిగివచ్చింది. హోల్‌సేల్ ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా అంచనాలకు తగ్గట్లే నమోదైతే ఆర్‌బీఐ వడ్డీరేట్ల భయాలు తగ్గి ఈ వారంలోనూ సూచీలు సరికొత్త రికార్డులను నెలకొల్పే అవకాశం ఉంది. సాంకేతికంగా నిఫ్టీ 16500 స్థాయిపైన ముగిసింది. అప్‌ట్రెండ్ కొనసాగితే నిఫ్టీ 16,800–17,000 శ్రేణిని పరీక్షించవచ్చు. దిగువస్థాయిలో 16,380 వద్ద తక్షణ మద్దతును కలిగి ఉంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదుతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో గతవారంలో సెన్సెక్స్, నిఫ్టీలు జీవితకాల రికార్డు స్థాయిలను నమోదుచేశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 1160 పాయింట్లు, నిఫ్టీ 291 పాయింట్లను ఆర్జించాయి.
అంతర్జాతీయ పరిణామాలు
చైనా జూలై పారిశ్రామికోత్పత్తి, రిటైల్ గణాంకాలు నేడు(సోమవారం) విడుదల కానున్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశపు మినిట్స్ బుధవారం వెల్లడి అవుతాయి. ద్రవ్యోల్బణ కట్టడి చర్యలపై ఫెడ్ రిజర్వ్ ఆలోచన తీరును మార్కెట్ వర్గాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. బాండ్ల కొనుగోళ్లను క్రమంగా తగ్గించాలని కొందరు ఫెడ్ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ అం శంపై మినిట్స్‌లో సానుకూల వైఖరి ఉంటే ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు సంభవించవ చ్చు.యూరోజోన్ జూలై ద్రవ్యోల్బణ గణాంకాలు అదేరోజున(ఆగస్ట్18న)విడుదల కానున్నాయి.
టోకు ద్రవ్యోల్బణ గణాంకాలు
కేంద్ర గణాంకాల శాఖ నేడు(సోమవారం) టోకు ద్రవ్యోల్బణ గణాంకాలను విడుదల చేయనుంది. జూన్‌లో 12.07 శాతంగా నమోదైన హోల్‌సేల్ ద్రవ్యోల్బణం జూలైలో 11.30% దిగిరావచ్చనే ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ గణాంకాలు కూడా అంచనాలకు తగ్గట్లు నమోదైతే ఆర్‌బీఐ వడ్డీరేట్ల భయాలు తగ్గి మార్కెట్ మరింత ముందుకెళ్లవచ్చు. ఆర్‌బీఐ శుక్రవారం ఆగస్ట్ 13తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వల గణాంకాలను వెల్లడించనుంది.
నికర కొనుగోలుదారులుగా ఎఫ్‌ఐఐలు
ఆర్థిక వ్యవస్థ రికవరీ నేపథ్యంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఈ ఆగస్ట్ ప్రథమార్థంలో ఎఫ్‌ఐఐలు రూ.2,085 కోట్ల షేర్లను కొన్నారు. ఇదే సమయంలో డెట్ మార్కెట్ నుంచి రూ.2,044 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. లార్జ్ క్యాప్ షేర్లను కొనేందుకు ఎఫ్‌ఐఐలు ఆసక్తి చూపుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఒకే రోజున నాలుగు లిస్టింగ్‌లు
ఒకేరోజున నాలుగు లిస్టింగ్‌లతో ప్రాథమిక మార్కెట్... సెకండరీ మార్కెట్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ఈ ఆగస్ట్ 4–6 తేదీల మధ్య పబ్లిక్ ఇష్యూలను పూర్తి చేసుకున్న నాలుగు కంపెనీల షేర్లు సోమవారం(నేడు) ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. దేవయాని ఇంటర్నేషనల్, క్రిష్ణా డయాగ్నస్టిక్స్, ఎక్సారో టైల్స్, విండ్లాస్ బయోటెక్ టైల్ కంపెనీల షేర్లు ఇందులో ఉన్నాయి. గ్రే మార్కెట్లో ఈ నాలుగు కంపెనీల షేర్లు ప్రీమియం ధరలతో ట్రేడ్ అవుతున్నందున లిస్టింగ్‌లో లాభాల్ని పంచవచ్చు. ఇదే వారంలో ఆప్టస్ వేల్యూ, నువోకో విస్టాస్ ఇష్యూలకు సంబంధించిన అలాట్మెంట్ ప్రక్రియ కూడా పూర్తి అవుతుంది. అలాగే కార్‌ట్రేడ్ టెక్, నువాకో విస్టా కార్పొరేషన్ కంపెనీలు శుక్రవారం ఐపీఓ షేర్లను లిస్ట్ చేయాలని భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment