దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:39 సమయానికి నిఫ్టీ 40 పాయింట్లు తగ్గి 24,493కు చేరింది. సెన్సెక్స్ 142 పాయింట్లు నష్టపోయి 80,462 వద్ద ట్రేడవుతోంది. రేపు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
అమెరికా డాలర్ ఇండెక్స్ 104.11 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 82.63 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.24 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.71 శాతం, నాస్‌డాక్ 0.81 శాతం నష్టపోయాయి.
ఎన్‌డీఏ 3.0 ప్రభుత్వం ఈ జులై 23న (మంగళవారం) ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్ కోసం మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆర్థిక లోటు, మూలధన వ్యయాలు, సామాజిక వ్యయాల కేటాయింపుల మధ్య సమతుల్యత చేకూర్చే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంతో ఈసారి ‘పారిశ్రామిక అనుకూల బడ్జెట్’ను నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉద్యోగ కల్పన, మేక్ ఇన్ ఇండియా, గ్రీన్ ఎనర్జీ, పట్టణ, గ్రామీణాభివృద్ధి అంశాలపై దృష్టి సారించే వీలుంది. అలాగే ‘దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను’పై ప్రకటన కోసం దేశీయ విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు పార్లమెంట్‌లో ప్రకటించే ఆర్థికసర్వే ప్రకారం రేపు విడుదల చేయనున్న బడ్జెట్ ఎలా ఉండబోతుందో ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment