దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:37 సమయానికి నిఫ్టీ 465 పాయింట్లు తగ్గి 24,243కు చేరింది. సెన్సెక్స్ 1556 పాయింట్లు నష్టపోయి 79,414 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 103.21 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 77.27 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.80 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.84 శాతం, నాస్‌డాక్ 2.43 శాతం నష్టపోయాయి. అధిక ద్రవ్యోల్బణం, పశ్చిమాసియా ఘర్షణలు, వాణిజ్య ఉద్రిక్తతలతో ఆర్థిక మాంద్య భయాల నేపథ్యంలో సూచీలు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల కన్సాలిడేషన్, బలహీన క్యూ1 కార్పొరేట్ ఫలితాలు, అధిక వాల్యుయేషన్ల కారణంగా దేశీయ స్టాక్ సూచీలూ నష్టాల్లోకి జారుకోవచ్చని చెబుతున్నారు.
అంతర్జాతీయ సంకేతాలు, ఆర్‌బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలు ఈ వారం దలాల్ స్ట్రీట్‌కు దారిచూపుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే స్థూల ఆర్థిక గణాంకాలు, త్రైమాసిక ఆర్థిక ఫలితాలూ ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, రూపాయి విలువ, క్రూడ్ కదలికలు తదితర సాధారణ అంశాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుందంటున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. రెండురోజులు పాటు ఈ సమావేశం గురువారం (8వ తేదీ) వరకూ ఈ సమావేశం జరుగుతుంది. ఆహార ద్రవ్యోల్బణం ఆందోళన రేకెత్తిస్తున్న తరుణంలో ద్రవ్య విధాన కమిటి రెపో రేటు(6.5%)ను యథాతథంగా కొనసాగించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే వడ్డీరేట్ల తగ్గింపు ఎప్పటి నుంచి అనే అంశంపై ఆర్‌బీఐ వివరణ కోసం మార్కెట్ వర్గాలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment