![Stock Market: Sensex Crashes 1018 Pts: Zomato Down 5 percent](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/Stocks.jpg.webp?itok=ZM9ATotg)
కొనసాగుతున్న అమ్మకాలు
సెన్సెక్స్ నష్టం 1,108 పాయింట్లు
నిఫ్టీ 310 పాయింట్ల పతనం
ముంబై: అమెరికా వాణిజ్య యుద్ధ భయాలు వెంటాడటంతో దేశీ స్టాక్ సూచీలు అయిదో రోజూ నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, నిరుత్సా హపరుస్తున్న కార్పొరేట్ ఫలితాలు మార్కెట్లపై మరింత ఒత్తిడి పెంచాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 1,018 పాయింట్లు పతనమై 76,294 వద్ద ముగిసింది. నిఫ్టీ 310 పాయింట్లు నష్టపోయి 23,072 వద్ద నిలిచింది. స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా అదే బాటలో నడిచాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,281 పాయింట్లు కోల్పోయి 76,031 వద్ద, నిఫ్టీ 395 పాయింట్లు నష్టపోయి 22,986 వద్ద కనిష్టాలు తాకాయి.
⇒ మార్కెట్ వరుస పతనంతో 5 రోజుల్లో రూ.17 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. మంగళవారం రూ.9.29 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.408.52 లక్షల కోట్ల(4.70 ట్రిలియన్ డాలర్లు)కు పడిపోయింది.
⇒ సెన్సెక్స్ మొత్తం 30 షేర్లలో ఒక్క ఎయిర్‌టెల్ (0.19%) మాత్రమే స్వల్ప లాభంతో గట్టెక్కింది. అత్యధికంగా జొమాటో 5%, టాటా స్టీల్ 3%, బజాజ్ ఫిన్‌సర్వ్ 2.70%, పవర్ గ్రిడ్ 2.65%, ఎల్‌అండ్‌టీ 2.60% నష్టపోయాయి. ఈ సూచీ గత రోజుల్లో 2,290 పాయింట్లు(3%) కోల్పోయింది. నిఫ్టీ ఇండెక్స్ 668 పాయింట్లు(2.81%) నష్టపోయింది.
⇒ రంగాల వారీగా రియల్టీ ఇండెక్స్ 3.14% క్షీణించింది. ఇండ్రస్టియల్ 3%, కన్జూమర్ డి్రస్కేషరీ 2.73%, క్యాపిటల్ గూడ్స్ 2.60%, ఆటో 2.50%, మెటల్ 2.23 శాతం చొప్పున పతనమయ్యాయి. బీఎస్‌ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 3.40%, 2.88 శాతం క్షీణించాయి.
నష్టాలకు కారణాలు
⇒ అమెరికా ఇండ్రస్టియల్ రంగాన్ని గాడిన పెట్టేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% టారిఫ్‌లు విధించారు. ఎలాంటి మినహాయింపులు, కోటాలు లేకుండా అన్ని దేశాలపై టారిఫ్‌లు ఫ్లాట్‌గా 25% ఉంటాయన్నారు. దీంతో గతంలో టారిఫ్‌లు అధికంగా లేని కెనడా, బ్రెజిల్, మెక్సికో, దక్షిణ కొరియా సహా ఇతర దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ట్రంప్ నిర్ణయం దేశాల మధ్య వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేసేలా ఉందని ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు.
⇒ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అమెరికా వాణిజ్య సుంకాల విధింపు, ద్రవ్యోల్బణం అంశాలపై సెనేట్ బ్యాకింగ్, హౌసింగ్ అర్బన్ అఫైర్స్ కమిటీ ముందు మాట్లాడనున్నారు. దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు.
⇒ విదేశీ ఇన్వెస్టర్లు 2025లోనే 9.94 బిలియన్ డాలర్లు విలువ చేసే ఈక్విటీలను విక్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment