రూ.93,520 కోట్ల బకాయిలు, సుప్రీంకోర్ట్‌కు ఎయిర్‌టెల్-వొడాఫోన్‌ | Supreme Court Reserves Order On Airtel,vi Plea Seeking Correction Of Errors In Agr Demand | Sakshi
Sakshi News home page

రూ.93,520 కోట్ల బకాయిలు, సుప్రీంకోర్ట్‌కు ఎయిర్‌టెల్-వొడాఫోన్‌

Published Tue, Jul 20 2021 8:16 AM | Last Updated on Tue, Jul 20 2021 8:31 AM

supreme court reserves order on Airtel,VI plea seeking correction of errors in AGR demand - Sakshi

న్యూఢిల్లీ: సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) లెక్కల లోపాలపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని టెలికం కంపెనీలకు సుప్రీంకోర్టు తెలియజేసింది.ప్రభుత్వానికి తాము చెల్లించాల్సిన ఏజీఆర్‌ బకాయిల లెక్కల్లో తప్పులు దొర్లాయని వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్, టాటా టెలీ సర్వీసెస్‌లు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం ఈ విషయాన్ని తెలిపింది. దాదాపు రూ.93,520 కోట్లు చెల్లించడానికి 2020 సెప్టెంబర్‌లో టెలికం సేవల కంపెనీలకు సుప్రీంకోర్టు పది సంవత్సరాల గడువును ఇచ్చిన సంగతి తెలిసిందే.

వాదనలు ఇలా.. 
టెలికం కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా జస్టిస్‌ ఎల్‌ఎన్‌ రావులతో కూడిన ధర్మాససం సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలో గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ప్రస్తావించింది. ఏజీఆర్‌ సంబంధిత బకాయిలను తిరిగి అంచనా వేయజాలమని పేర్కొంది. అయితే అర్థమెటికల్‌ లోపాలను సరిదిద్దే అవకాశం ఉంటుందని, ఎంట్రీస్‌ డ్యూప్లికేషన్‌ జరిగినట్లు లెక్కల్లో స్పష్టమయినట్లు కంపెనీల న్యాయవాదులు ఈ సందర్భంగా విన్నవించారు. ‘‘అర్థమెటికల్‌ ఎంట్రీస్‌ విషయంలో టెలికమ్యూనికేషన్ల శాఖ (టెలికం) మేము తప్పు పట్టడం లేదు’’ అని వొడాఫోన్‌ ఐడియా తరఫు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. ఎంట్రీలను టెలికం శాఖ ముందు పెట్టి, తిరిగి పరిశీలించుకోదలచామని అన్నారు. ఇందుకు అనుమతించాలని కోరారు. ఎయిర్‌టెల్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఏఎం సంఘ్వీ, టాటా టెలీ సర్వీసెస్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది అరవింద్‌ దత్తార్‌లు కూడా ఇదే విధమైన విజ్ఞప్తి చేశారు. దీనిపై మీ అభిప్రాయమేమిటని అప్పట్లో టెలికం శాఖ తరఫున వాదలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను సుప్రీం ప్రశ్నించింది. అయితే దీనిపై తనకు తాజా ఇన్‌స్ట్రక్షన్స్‌ ఏవీ లేవని, టెలికం శాఖ అభిప్రాయం తెలుసుకోడానికి రెండు రోజుల సమయం ఇవ్వాలని ఆయన ధర్మాసనానికి విన్నవించారు. దీనితో ఈ అంశంపై తగిన ఉత్తర్వులు ఇస్తామని న్యాయమూర్తులు ఎస్‌ఏ నజీర్, ఎంఆర్‌ షాలు కూడా కలిగి ఉన్న ధర్మాసనం సూచించింది.

2031 మార్చిలోపు దశలవారీగా.. 
టెలికం శాఖ డిమాండ్‌ చేసిన ఏజీఆర్‌ బకాయిల్లో 10 శాతాన్ని 2021 మార్చి 31వ తేదీలోపు చెల్లించాలని టెలికం కంపెనీలకు గత ఏడాది సెప్టెంబర్‌లో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. మిగిలిన మొత్తాలను 2021 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 2031 మర్చి 31వ తేదీ లోపు వార్షిక వాయిదాల్లో చెల్లించాలని సూచించింది. ఆయా అంశాలపై ఇదే తుది నిర్ణయమని కూడా సుప్రీంకోర్టు  అప్పట్లో స్పష్టం చేసింది. నిజానికి ఏజీఆర్‌ సమస్యపై తన తీర్పును 2019 అక్టోబర్‌లో సుప్రీం తీర్పు నిచ్చింది. అయితే బకాయిలను వాయిదాల వారీగా చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ గత ఏడాది మార్చిలో టెలికం శాఖ గత ఏడాది సుప్రీంను ఆశ్రయించింది. దీనికి అత్యున్నత న్యాయస్థానం అనుమతులు ఇస్తూ, 2021 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 2031 మర్చి 31వ తేదీ లోపు వార్షిక వాయిదాల్లో చెల్లించాలని సూచించింది. ్ఞ్ఞ్ఞ్ఞసుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియాసహా టెలికం ఆపరేటర్లు  ఏజీఆర్‌ బకాయిల్లో 10 శాతాన్ని 2021 మార్చి 31వ తేదీ నాటికి తనకు చెల్లించాయి.  


 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement