న్యూఢిల్లీ: వ్యాపారంలో దూసుకుపోవడానికి తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణల విషయంలో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు ఊరట లభించింది. దీనిపై పునఃదర్యాప్తు దర్యాప్తు జరపాలని ఫెయిర్ ట్రేడ్ రెగ్యులేటర్ కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను ఆదేశిస్తూ మార్చి 4వ తేదీన నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌ఏటీ) ఇచ్చిన రూలింగ్‌కు బుధవారం సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆల్ ఇండియా ఆన్‌లైన్ వెండార్స్ అసోసియేషన్ (ఏఐఓవీఏ– అమ్మకందారుల సంఘం), సీఐఐలకు చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రామస్వామిలతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
ఆరోపణలు అవాస్తవం: ఫ్లిప్‌కార్ట్
ఆల్ ఇండియా ఆన్‌లైన్ వెండార్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ఫిర్యాదును విచారించిన సీసీఐ, తక్కువ ధరల విధానంతో తన ఆధిపత్య స్థానాన్ని ఫ్లిప్‌కార్ట్ దుర్వినియోగం చేస్తోందని ఆరోపణలను తోసిపుచ్చుతూ 2018 నవంబర్ 6న రూలింగ్ ఇచ్చింది. అయితే దీనిపై అప్పీల్‌ను స్వీకరించిన ఎన్‌సీఎల్‌ఏటీ, అసోసియేషన్ వాదనలపై తిరిగి విచారణ చేపట్టాలని సీసీఐని ఆదేశించింది. దీనిని వ్యతిరేకిస్తూ ఫ్లిప్‌కార్ట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసులో సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే తన వాదనలు వినిపిస్తూ, ఈ అంశంలో ‘ప్రిడెక్టరీ ప్రైసింగ్’ (అతి తక్కువ ధరకు వస్తు, సేవల ద్వారా ప్రత్యర్థులను మార్కెట్ వదిలిపోయేలా చేయడం) కీలకాంశం అన్నారు.
ఇలాంటి ఆరోపణలను (ప్రిడెక్టరీ ప్రైసింగ్) కేవలం ఆధిపత్య కంపెనీపైనే చేయాల్సి ఉంటుందని అన్నారు. అసలు ఫ్లిప్‌కార్ట్ ఆధిపత్య కంపెనీ కోవలోకే చెందదని స్పష్టం చేశారు. ఈ సందర్భంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, ఫ్లిఫ్‌కార్ట్ ఆధిపత్య స్థానంలోనే లేదని సీసీఐ తన ఉత్తర్వు్యలో పేర్కొందని, ఈ విషయాన్ని ఎన్‌సీఎల్‌ఏటీ కూడా తోసిపుచ్చలేదని గుర్తుచేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసి, కేసు తదుపరి విచారణకు వాయిదావేసింది. 2018 నవంబర్‌లో ఇచ్చిన సీఐఐ ఉత్తర్వుల ప్రకారం, ఆల్ ఇండియా ఆన్‌లైన్ వెండార్స్ అసోసియేషన్‌లో 2,000కుపైగా సెల్లర్స్‌కు సభ్యత్వం ఉంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ తరహాలోనే ఏఐఓవీఏ సభ్యత్వ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment