
న్యూఢిల్లీ: ప్రత్యర్థుల వ్యాపారాలను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారని తమపై వచ్చిన ఆరోపణలను విచారించరాదని కోరుతున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ విషయంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణను నిలువరించాలన్న అమెరికా ఈ–కామర్స్ దిగ్గజ కంపెనీల అప్పీలేట్ పిటిషన్లను చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ వినీత్ సరాన్, జస్టిస్ సూర్య కాంత్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచి్చంది. ఈ అంశం విషయంలో కర్ణాటక హైకోర్టులో ఓడిపోయిన రెండు ఈ–కామర్స్ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అమెరికా సంస్థలు తమ ఈ–కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఎంపిక చేసిన విక్రేతలను ప్రోత్సహిస్తున్నాయని, తద్వారా పోటీని అణిచివేసే వ్యాపార పద్ధతులకు పాల్పడుతున్నాయని బ్రిక్–అండ్–మోటార్ రిటైలర్లు ఆరోపించాయి.
ఢిల్లీ వయాపర్ మహాసంఘ్ ఈ అంశంపై ఫిర్యాదు చేసింది. దీంతో ఈ గుత్తాధిపత్య ఆరోపణలపై విచారణకు 2020 జనవరిలో సీసీఐ ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలపై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన రెండు సంస్థలకు అక్కడ చుక్కెదురైంది. ‘నిజానికి ఈ తరహా విచారణకు మీకు మీరుగా ముందుకొస్తారని మేము భావించాం. విచారణకు సిద్ధం కావాలి. కానీ మీరు అలా కోరుకోవడం లేదు’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. ‘క్రిమినల్ చట్టం కింద ఏదైనా ఫిర్యాదు దాఖలైతే ఎఫ్‌ఐఆర్ నమోదుచేస్తారు. ఆ నమోదుకు ముందే నోటీసు ఇవ్వండి అన్నట్లు ఉంది మీ వాదన’ అని కూడా త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, సుప్రీం తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే గోయెల్ మరో ప్రకటన చేస్తూ, బడా ఆన్‌లైన్ రిటైలర్లపై సీసీఐ వద్ద ఫిర్యాదు చేయడానికి తగిన ఆధారాలతో సిద్ధంకావాలని ట్రేడర్లకు విజ్ఞప్తి చేయడం మరో విశేషం.
Comments
Please login to add a commentAdd a comment