న్యూఢిల్లీ: అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేసే విషయమైన ప్రభుత్వ లక్ష్యాలను వీలైనంత త్వరగా సాధించేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) కృషి చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి వివేక్ జోషి కోరారు. పీఎస్‌బీల అధినేతలు, నాబార్డ్ చైర్మన్‌తో ఆర్థిక శాఖ సమీక్షా సమావేశం నిర్వహించింది.
పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి (పీఎం స్వనిధి) పథకం కింద దరఖాస్తులను వేగంగా పరిష్కరించి, అవసరమైన మేర రుణాలను మంజూరు చేయాలని వివేక్ జోషి కోరారు. వీధి వర్తకులను డిజిటల్ చానళ్లపైకి వేగంగా తీసుకురావాలని, డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేయాలని సూచించారు.
జన్ సురక్షా, ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన, ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమాయోజన, అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన, స్టాండప్ ఇండియా పథకాల విషయమై బ్యాంకుల పనితీరును ఈ సమావేశంలో సమీక్షించినట్టు ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. డిజిటల్ చెల్లింపులను పెంచే లక్ష్యంతో, డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన అంశాలపైనా సమావేశంలో చర్చించినట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment