
న్యూఢిల్లీ: ఆపిల్ ఐఫోన్ లవర్స్‌కు ఆనందాన్నిచ్చే వార్త ఒకటి మార్కెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐఫోన్‌ల తయారీకి, అలాగే భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీకి ఒక జాయింట్ వెంచర్‌ను స్థాపించేందుకు టాటాగ్రూప్ భారీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు ఆపిల్‌కు తైవాన్ సరఫరాదారుతో టాటా చర్చలు జరుపు తోందని తెలుస్తోంది.
సాల్ట్-టు-సాఫ్ట్‌వేర్ దిగ్గజం టాటాగ్రూపు ఆపిల్ సంస్థకు చెందిన తైవాన్ సరఫరాదారు విస్ట్రన్ కార్పొరేషన్‌తో చర్చలు జరుపుతోంది. ఐఫోన్ల అసెంబ్లింగ్, అలాగే ఎలక్ట్రానిక్స్ తయారీ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇదే వాస్తవమైతే ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, సప్లయ్ చైన్ అండ్ అసెంబుల్ దిగ్గజం విస్ట్రన్‌తో టాటా గ్రూప్ ఒప్పందం కీలకంగా మారనుంది. ఫలితంగా ఐఫోన్లను తయారు చేసే తొలి భారతీయ కంపెనీగా టాటా నిలవనుంది. దీంతో విలాసవంతమైన ఐఫోన్లు, సరసమైన ధరల్లో కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఎలక్ట్రానిక్స్, హైటెక్ మాన్యు ఫాక్చరింగ్‌పై తమ కంపెనీ ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు ఇటీవల టాటాగ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ వ్యాఖ్యలు ఈ అంచనాలను మరింత బలాన్ని ఇస్తున్నాయి
భౌగోళిక, రాజకీయ వివాదాలు పెరుగుతున్న సమయంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి హబ్ చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు అమెరికాలాంటివి దృష్టిపెట్టనున్నాయి. అలాగే దేశంలో అసెంబ్లింగ్ సంస్థల ఏర్పాటుకు ఇతర ప్రపంచ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్స్‌కు కూడా ఇది తోడ్పడనుంది. అయితే ఈ వార్తలపై విస్ట్రన్ ప్రతినిధి గానీ, టాటా గ్రూపునుంచి గానీ, ఆపిల్ నుంచిగానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.