
గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని నిరసిస్తూ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. హౌతీల ఆగడాలకు అడ్డుకట్టవేయడానికి అమెరికా సహా 12 మిత్ర దేశాలు ఏకమయ్యాయి. ఎర్రసముద్రంలో గస్తీ నిర్వహిస్తున్నాయి. వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి.
ఎర్ర సముద్రంలో హౌతీలు సృష్టిస్తున్న అలజడుల దెబ్బ అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా (Tesla)కు గట్టిగా తగిలింది. తన బెర్లిన్ ఫ్యాక్టరీలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 11 వరకు చాలా కార్ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టెస్లా ప్రకటించినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది.
ఎర్ర సముద్రంలోని నౌకలపై జరుగుతున్న దాడుల ప్రభావం సరకు రవాణాపై తీవ్రంగా పడింది. దీంతో కంపెనీకి విడిభాగాల సరఫరా తగ్గిపోయింది. ఫలితంగా ఉత్పత్తిని నిలిపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇరాన్-మద్దతుగల హౌతీ మిలిటెంట్లు గాజాలోని హమాస్‌కు సంఘీభావంగా ఎర్ర సముద్రంలో నౌకలు లక్ష్యంగా చేస్తున్న దాడులకు పర్యవసానంగా తగిలిన గట్టి దెబ్బగా దీన్ని భావిస్తున్నారు.
ఎర్ర సముద్రంలో జరుగుతున్న సాయుధ దాడుల కారణంగా కేప్ ఆఫ్ గూడ్ హోప్ ద్వారా యూరప్, ఆసియా మధ్య రవాణా మార్గాలలో మార్పులు జరగడం తమ బెర్లిన్ ఫ్యాక్టరీలో ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నట్లు టెస్లా ఒక ప్రకటనలో తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఉత్పత్తి నిలిపోవడానికి నిర్దిష్ట కారణాలను వెల్లడించనప్పటికీ ఫిబ్రవరి 12న పూర్తి ఉత్పత్తిని పునఃప్రారంభించనున్నట్లు టెస్లా పేర్కొంది.
ఎర్ర సముద్రంలో అలజడి కారణంగా ఇతర వాహన తయారీదారులు ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవచ్చని ఆటో పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టెస్లాతోపాటు చైనీస్ ఆటోమొబైల్ కంపెనీ గీలీ, అతిపెద్ద ఫర్నీచర్ కంపెనీ ఐకియా సహా అనేక కంపెనీలు డెలివరీ ఆలస్యం గురించి ఇప్పటికే హెచ్చరించాయి.
Comments
Please login to add a commentAdd a comment