
తుఫానులనూ తట్టుకోగల డ్రోన్ చిన్నసైజు హెలికాప్టర్‌లా కనిపించే ఈ డ్రోన్ వాతావరణంలోని ఎలాంటి మార్పులనైనా తట్టుకుంటూ ఇట్టే దూసుకుపోగలదు. చెక్ కంపెనీ ‘థండర్ ఫ్లై’ ఈ డ్రోన్‌ను ‘టీఎఫ్–జీ1’ పేరుతో ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసింది.
అత్యవసర వస్తువులను గమ్యానికి చేరవేయడానికి వీలుగా ‘థండర్ ఫ్లై’ ఇంజినీర్లు దీనిని రూపొందించారు. తుఫానుల్లో సైతం ఈ డ్రోన్ చెక్కుచెదరకుండా ప్రయాణించగలదు. రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ డ్రోన్‌ను ఒకసారి పూర్తిగా చార్జ్ చేసుకుంటే, గంటకు పైగా నిరంతరాయంగా ప్రయాణించగలదు.
ఇది ఐదు కిలోల వరకు బరువున్న వస్తువులను ఒక చోటు నుంచి మరొక చోటుకు సురక్షితంగా తీసుకుపోగలదు. తుఫానుల్లో చిక్కుకు పోయిన వారికి ఆహారం, ఔషధాలు వంటి అత్యవసర వస్తువులను చేరవేయడానికి ఇది బాగా ఉపయోగపడగలదు. థండర్ ఫ్లై వెబ్‌సైట్ ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు. దీని ధర 9,999 డాలర్లు (రూ.8.33 లక్షలు). రోటరీ బ్లేడ్లు అదనంగా కావాలను కుంటే, మరో 499 డాలర్లు (రూ.41,611) చెల్లించాల్సి ఉంటుంది.