Olympic Games Tokyo 2020: Google's Dinosaur Game Now Features Olympic Torches - Sakshi
Sakshi News home page

Google Dinosaur Game: నెట్‌ ఆగిపోగానే కనిపించే టైంపాస్‌.. ఆటకు కొత్త అప్‌డేట్స్‌ ఇవే!

Published Mon, Jul 26 2021 8:21 AM | Last Updated on Mon, Jul 26 2021 12:53 PM

Tokyo Olympics Google Dinosaur Updated With Torches Minigames - Sakshi

గూగుల్‌లో కనిపించే బ్రౌజర్‌ గేమ్‌ ‘డైనోసార్‌’ తెలుసు కదా. ఇంటర్నెట్‌ ఆగిపోగానే.. చాలామందికి అదొక టైంపాస్‌ యవ్వారంగా ఉంటోంది. అయితే ఆ గేమ్‌కు కొత్త హంగులు అద్దినట్లు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ స్వయంగా ప్రకటించాడు. ఇంతకీ ఈ Google Dinosaur Game కొత్త  అప్‌డేట్‌ ఏంటంటే.. ఒలింపిక్స్‌ మినీ గేమ్స్‌.

సాక్షి, వెబ్‌డెస్క్‌:  అడ్డుగా వచ్చే ముళ్ల పొదల చెట్లు, పై నుంచి దూసుకొచ్చే పక్షులు. వాటిని తప్పించుకుంటూ పరుగులు తీసే బుల్లి డైనోసార్‌. స్పేస్‌ బార్‌తో ఈ గేమ్‌ కంట్రోలింగ్‌ ఉంటుంది. దాని సాయంతో డైనోసార్‌ను తప్పించి ముందుకు పరిగెత్తాలి. పోను పోను వేగం పెరుగుతూ పోతుంటుంది. అయితే ఈ గేమ్‌కు ఒలింపిక్స్‌ గేమ్స్‌ తరహా ఫీచర్స్‌ను చేర్చారు. ఆటలకు సంబంధించిన టీ-రెక్స్‌(డైనోసార్‌),  ఒలింపిక్స్‌ మినీ గేమ్స్‌, ఒలింపిక్‌ ఫ్లేమ్‌, రింగులు, మెడల్స్‌.. ఇలాంటి ఫీచర్లను చేర్చారు. అయితే పిచాయ్‌ కంటే ముందే ఓ రెడ్డిట్‌ యూజర్‌ ఈ విషయాన్ని గుర్తించి అప్‌డేట్‌ ఇవ్వడం విశేషం.

అంతరించిపోయిన డైనోసార్ల నుంచి ఓ బుల్లి గేమ్‌.. అదీ అందరికీ అందుబాటులో ఎలా ఉంటుందనే సెబాస్టియన్‌ గాబ్రియల్‌ ఆలోచన నుంచి పుట్టింది ఇది.​ 2014లో శాన్‌ ఫ్రాన్సిస్కో కు చెందిన ఈ వెబ్‌ డిజైనర్‌ డైనోసార్‌ గేమ్‌ను లాంఛ్‌ చేశాడు. 70వ దశకంలో ప్రపంచాన్ని ఊపిన ఇంగ్లీష్‌ రాక్‌ బ్యాండ్‌ టీ రెక్స్‌ పేరు మీద ఈ గేమ్‌ను రూపొందించాడు సెబాస్టియన్‌. మొదట్లో ప్రాజెక్ట్‌ బోలన్‌ పేరుతో దీనిని మొదలుపెట్టాడు. మార్క్‌ బోలన్‌ ఎవరంటే.. టీ-రెక్స్‌ లీడ్‌ సింగర్‌. 2014 సెప్టెంబర్‌లో ఈ గేమ్‌ రిలీజ్‌ కాగా..పాత డివైజ్‌లలో పని చేయలేదు. దీంతో డిసెంబర్‌లో అప్‌డేట్‌ వెర్షన్‌తో రీ-రిలీజ్‌ చేశారు. పాయింట్లు దాటుకుంటూ పోతుంటే రంగులు కూడా మారుతుంది ఈ గేమ్‌. సగటున నెలకు 27 కోట్ల మంది(అంతకు మించే) ఈ గేమ్‌ను ఆడుతుంటారని గూగుల్‌ చెబుతోంది.

తర్వాతి కాలంలో గేమ్‌కు అప్‌డేట్స్‌ రాగా.. డినో స్వార్డ్స్‌ అని కత్తులు, కటార్లు, గొడ్డలు తగిలించారు. ఆటలో కొంచెం అటు ఇటు తేడా జరిగినా ఆ ఆయుధాలు డైనోసార్‌ను బలి తీసుకుంటాయి. ఇక రంగు రంగుల టోపీలు, ఐకాన్లు కూడా ఈ బుల్లి డైనోసార్‌కు తగిలించుకుని ఆడే వీలుంది. ​ తాజా ఒలింపిక్స్‌ అప్‌డేట్‌ ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌కి వర్తిస్తుందని గూగుల్‌ స్పష్టం చేసింది. టీ-రెక్స్‌ కూడా రూపాలు మారడంతో పాటు పరుగులు పెడుతుందని, ఫినిషింగ్‌ లైన్‌ లక్క్ష్యంగా గేమ్‌ భలేగా ఉందని సదరు రెడ్డిట్‌ యూజర్‌ వెల్లడించాడు. ఇంతకీ ఈ గేమ్‌ మాగ్జిమమ్‌ పాయిం‍ట్లు 99999 రీచ్‌ అయితే ఏమవుతుందో తెలుసా?.. మళ్లీ సున్నాకే వచ్చేస్తుంది. కాకపోతే ఈసారి డైనోసార్‌ వేగం శరవేగంగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement