రూపాయి కంటే తక్కువ విలువైన కరెన్సీలు ఇవే.. | Undervalued Currency Compare With Indian Rupee | Sakshi
Sakshi News home page

రూపాయి కంటే తక్కువ విలువైన కరెన్సీలు ఇవే..

Published Thu, Jan 18 2024 1:58 PM | Last Updated on Thu, Jan 18 2024 4:39 PM

Undervalued Currency Compare With Indian Rupee - Sakshi

సాధారణంగా అంతర్జాతీయ వాణిజ్యంలో ఏ దేశపు కరెన్సీనైనా అమెరికా డాలర్ విలువలో చెల్లిస్తుంటారు. చాలా దేశాల్లోని కరెన్సీ కంటే యూఎస్‌ డాలరు విలువ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే మన రూపాయి మారకం విలువ సుమారు రూ.83 వద్ద ఉంది.

అమెరికాతోపాటు మరికొన్ని దేశాల కరెన్సీ కూడా రూపాయి కంటే ఎక్కువే. అందుకే ఆయా దేశాల్లో పర్యటించాలన్నా.. అక్కడే స్థిరపడాలన్నా బోలెడంత డబ్బు ఖర్చవుతుంది. కానీ, కొన్ని దేశాల్లో అక్కడి కరెన్సీ కంటే మన రూపాయి విలువ అధికంగా ఉంది. వాటి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 

వియత్నాం-డాంగ్‌

దక్షిణాసియాలో ఉండే వియత్నాం దేశానికి ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మంచి పేరుంది. ఇక్కడ అందమైన బీచ్‌లు, ఆకట్టుకునే సంస్కృతి, నోరూరించే వంటలు సందర్శకులను కట్టిపడేస్తాయి. కాగా మన ఒక్క రూపాయి ఇక్కడ 295.4 వియత్నాం డాంగ్‌గా ఉంది. అంటే రూ.100 వియత్నాం కరెన్సీలో 29,540 డాంగ్‌లతో సమానం.

లావోస్‌-లావోటియన్‌ కిప్‌

థాయ్‌లాండ్‌, వియత్నాం, మయన్మార్‌ దేశాలకు పొరుగున ఉండే లావోస్‌లో చాలావరకు అంతర్జాతీయ సదస్సులు జరుగుతుంటాయి. ఈ దేశంలో ఉన్న అత్యంత అందమైన గ్రామాలు, జలపాతాలను చూడటానికి సందర్శకులు వస్తుంటారు. లావోస్‌ కరెన్సీ లావోటియన్‌ కిప్‌. మన ఒక్క రూపాయి.. 248.16లావోటియన్‌ కిప్‌తో సమానం. అంటే భారతీయ కరెన్సీ రూ.100కి లావోస్‌ కరెన్సీలో విలువ 24,816.34.

ఇండోనేషియా-రుపియా

ఇండోనేషియా కూడా ఆసియా ఖండంలో భాగమే. అగ్ని పర్వతాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇదొకటి. పురాతన హిందూ, బౌద్ధ దేవాలయాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ దేశపు కరెన్సీ ఇండోనేషియన్‌ రుపియా. మన ఒక్క రూపాయి విలువ ఇక్కడ 187.95 రూపియాలు. అంటే మన దగ్గర రూ.100 ఉంటే, ఇండోనేషియాలో 18,795 రుపియాలతో సమానం.

ఉజ్బెకిస్థాన్‌-సోమ్‌

మధ్య ఆసియాలో.. ఇస్లామిక్‌ దేశాల సరసన ఉన్న ఉజ్బెకిస్థాన్‌లో ఆధునిక భవనాలతోపాటు 17వ శతాబ్దం నాటి నిర్మాణాలు, సాంస్కృతిక అవశేషాలు కనిపిస్తుంటాయి. ఎటు చూసినా ఇస్లామిక్‌ శైలి కట్టడాలు, మసీదులు దర్శనమిస్తాయి. ఈ దేశపు కరెన్సీ ఉజ్బెకిస్థానీ సోమ్‌. మన రూపాయి విలువ అక్కడ 148.23సోమ్స్‌గా ఉంది. అంటే రూ.100 ఉంటే, ఉజ్బెకిస్థాన్‌లో 14,823 సోమ్స్‌ ఉన్నట్లే. 

కాంబోడియా-కాంబోడియన్‌ రియల్స్‌

చారిత్రక కట్టడాలను కాపాడుకుంటూ వస్తోన్న ఆసియా దేశం కాంబోడియా. అక్కడి చారిత్రక నిర్మాణాలు, మ్యూజియాలను చూసేందుకు ఏటా లక్షల మంది సందర్శకులు వెళ్తుంటారు. ఆ దేశ కరెన్సీ కాంబోడియన్‌ రియల్స్‌ కాగా.. మన రూపాయితో పోలిస్తే ఆ దేశ కరెన్సీ మారకం విలువ 49.03గా ఉంది. అంటే భారత కరెన్సీ రూ.100 ఉంటే, కాంబోడియా కరెన్సీలో 4903.70 రియల్స్‌తో సమానం.

కొలంబియా-పెసో

దక్షిణ అమెరికాలోని కొలంబియా దేశం.. కరేబియన్‌, పసిఫిక్‌ సముద్రాల తీరంలో ఉంటుంది. పర్యాటకంగా ఈ దేశం అంతగా అనువైనది కాదనే చెప్పాలి. ఎందుకంటే ఈ దేశంలో నేరాలు ఎక్కువగా జరుగుతుంటాయట. ముఖ్యంగా మనుషుల్ని అపహరిస్తుంటారు. అందుకే ఈ దేశంలో పర్యటించేవారిని సంబంధిత అధికారులు హెచ్చరిస్తుంటారు. కాగా.. ఈ దేశ కరెన్సీని కొలంబియన్‌ పెసోగా పిలుస్తారు. ఒక రూపాయి విలువ అక్కడ 47.60 పెసోలుగా ఉంది. అంటే రూ.100 ఉంటే, అది 4760.15 పెసోలతో సమానం.

దక్షిణ కొరియా-కొరియన్‌ వాన్‌

తూర్పు ఆసియా దేశాల్లో ఒకటైన దక్షిణ కొరియా అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తూ ప్రపంచంతో పోటీ పడుతోంది. ఈ దేశంలో సినిమాలు, కె-పాప్‌ సంగీతం, ఫ్యాషన్‌, టెక్నాలజీ రంగం, కాస్మోటిక్‌ సర్జరీలు చాలా పాపులర్‌. ఈ దేశపు కరెన్సీ సౌత్‌ కొరియన్‌ వాన్‌. ఇక్కడి ఒక్క సౌత్‌ కొరియన్‌ వాన్‌తో రూపాయి మారకం విలువ చూస్తే.. ఒక రూపాయి 16.11వాన్‌లతో సమానం. అంటే రూ.100 ఉంటే దక్షిణ కొరియా కరెన్సీలో 1610.82 వాన్‌ ఉన్నట్లు. 

గమనిక: ఈ కరెన్సీ విలువలు జనవరి 18, 2024వ తేదీ ప్రకారం ఇవ్వబడ్డాయి. నిత్యం వీటి విలువ మారుతోంది. గమనించగలరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement