
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) రాబోయే త్రైమాసికాల్లో భారత్‌లో 5జీ సేవలు ప్రారంభించేందుకు, అలాగే 4జీ కవరేజీని విస్తరించడానికి భారీగా పెట్టుబడులు చేస్తుందని దిగ్గజ పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా ఇండియా మొబైల్ కాంగ్రెస్ వేదికగా వెల్లడించారు. ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్‌తోసహా క్లిష్ట, అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో బలమైన సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ దృష్టిని సాకారం చేయాలని కంపెనీ నిశ్చయించుకుందని ఆయన చెప్పారు.
జియోస్పేస్‌ఫైబర్..
మారుమూల ప్రాంతాలకు హై–స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి భారత్‌లో మొట్టమొదటి ఉపగ్రహ ఆధారిత గిగా ఫైబర్ సేవలైన జియోస్పేస్‌ఫైబర్‌ను విజయవంతంగా ప్రదర్శించినట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. ఈ సేవలు అత్యంత సరసమైన ధరలలో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాష్ అంబానీ జియో పెవీలియన్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి జియోస్పేస్ ఫైబర్‌తో సహా కంపెనీ అభివృద్ధి చేసిన స్వదేశీ సాంకేతికత, ఉత్పత్తుల గురించి వివరించారు.