
ఫెడ్ పాలసీ సమావేశంపైనా దృష్టి
యూఎస్ మార్కెట్, టారిఫ్‌ల ఎఫెక్ట్
చమురు, రూపాయి మారకానికీ ప్రాధాన్యం
దేశీ స్టాక్ మార్కెట్ కదలికలపై నిపుణుల అంచనాలు
ఈ వారం ప్రధానంగా విదేశీ అంశాలే దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయి. వీటికితోడు యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది. వెరసి ఇన్వెస్టర్లు దేశ, విదేశీ ఆర్థిక గణాంకాలతోపాటు ఫెడ్ వడ్డీ నిర్ణయాలపై దృష్టిపెట్టనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
ముంబై: అంతర్జాతీయంగా నేడు(17న) పలు ఆర్థిక గణాంకాలు వెలువడనున్నాయి. దేశీయంగా ఫిబ్రవరి నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. జనవరిలో డబ్ల్యూపీఐ 2.31 శాతానికి చేరగా.. 2024 డిసెంబర్‌లో 2.37 శాతంగా నమోదైంది. విదేశీ అంశాలలో జనవరి–ఫిబ్రవరికి చైనా పారిశ్రామికోత్పత్తి, రిటైల్ అమ్మకాల గణాంకాలు నేడు వెల్లడికానున్నాయి. ఫిబ్రవరిలో యూఎస్ రిటైల్ సేల్స్‌సహా హౌసింగ్ డేటా నేడు విడుదలకానుంది.
ఈ బాటలో ఫిబ్రవరికి జపాన్ వాణిజ్య బ్యాలన్స్ గణాంకాలు, బ్యాంక్ ఆఫ్ జపాన్(బీవోజే) వడ్డీ రేట్ల నిర్ణయాలు 19న వెల్లడికానున్నాయి. గత సమీక్షలో స్వల్పకాలిక వడ్డీ రేటును 0.25 శాతం పెంచడంతో 0.5 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. ఇది గత 17ఏళ్లలోనే అత్యధికంకాగా.. 20న గత నెలకు యూఎస్ గృహ విక్రయాల డేటా విడుదలకానుంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేట్లపై నిర్ణయాలు ప్రకటించనుంది. 21న జపాన్ ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడికానున్నాయి. జనవరిలో ద్రవ్యోల్బణం 4 శాతానికి ఎగసింది.
ఫెడ్ ఏం చేయనుంది?
రేపు(18న) ప్రారంభంకానున్న యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశ నిర్ణయాలు బుధ వారం(19న) వెల్లడికానున్నాయి. రెండు రోజులు సమావేశంకానున్న ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) గత సమీక్షలో యథాతథ పాలసీ అమలుకే కట్టుబడింది. అయితే ప్రెసిడెంట్ ట్రంప్ పలు దేశాలపై విధిస్తున్న ప్రతీకార టారిఫ్‌లు, ద్రవ్యోల్బణం తదితర గణాంకాలు వడ్డీ రేట్ల నిర్ణయాలను ప్రభావితం చేయనున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.
అయితే మరోసారి ఫెడరల్ ఫండ్స్ రేట్లను యథాతథంగా 4.25–4.5 శాతంవద్ద కొనసాగించేందుకే నిర్ణయించే వీలున్నట్లు అధిక శాతంమంది నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్ టారిఫ్‌ల విధింపు, విధానాల నేపథ్యంలో ఆర్థిక వృద్ధి, ధరలు, ఉపాధి కల్పన తదితర అంశాలకు ఫెడ్ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేశారు. దీంతో ఫెడ్ సంకేతాలపై ప్రపంచ దేశాలు దృష్టిపెట్టనున్నట్లు వివరించారు.
ఇతర అంశాలు
అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు 70 డాలర్ల దిగువన కదులుతున్నాయి. ఒపెక్, సంబంధిత దేశాలు ఏప్రిల్ నుంచీ చమురు ఉత్పత్తి పెంపు ప్రణాళికను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. వెరసి రోజుకి 1,38,000 బ్యారళ్లమేర చమురు అధికంగా సరఫరాకానుంది. ఇది భారత్‌కు సానుకూల అంశమని ఆర్థికవేత్తలు తెలియజేశారు.
ఇక మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి 87 స్థాయిలో బలహీనంగా కదులుతోంది. కాగా.. ట్రంప్ టారిఫ్‌ల కారణంగా యూఎస్ ఆర్థిక వ్యవస్థ బలహీనపడితే దేశీ మార్కెట్లపై ప్రభావం పడుతుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్విసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. ఈ వారం హెచ్చుతగ్గుల మధ్య మార్కెట్లు స్వల్ప కదలికలకే పరిమితంకావచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్‌మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్దార్ధ ఖేమ్కా అభిప్రాయపడ్డారు.
గత వారమిలా
హోలీ పండుగ సందర్భంగా నాలుగు రోజులకే పరిమితమైన గత వారం ట్రేడింగ్‌లో దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్పంగా క్షీణించాయి. ఆటుపోట్ల మధ్య సెన్సెక్స్ నికరంగా 504 పాయింట్లు(0.7 శాతం) బలహీనపడింది. 73,829 వద్ద నిలిచింది. నిఫ్టీ 155 పాయింట్లు(0.7 శాతం) క్షీణించి 22,397 వద్ద స్థిరపడింది. చిన్న షేర్లలో అమ్మకాలు కొనసాగడంతో బీఎస్‌ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.1 శాతం నీరసించగా.. స్మాల్ క్యాప్ 3.9 శాతం పతనమైంది.
Comments
Please login to add a commentAdd a comment