ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్‌ఎస్‌ఎస్)లో ఒక వ్యక్తికి పెట్టుబడి ఉంది. అయితే మూడేళ్ల లాకిన్ పీరియడ్ నిండకుండానే అతడు మరణించాడు. దీంతో ఈఎల్‌ఎస్‌ఎస్ యూనిట్లను నామినీకి బదిలీ చేశారు. మూడేళ్ల లాకిన్ పీరియడ్ పూర్తి కాకకపోయినా ఇప్పుడు నామినీ వాటిని విక్రయించుకోవచ్చా? – బుదేరియా అచ్చర్
దురదృష్టవశాత్తూ యూనిట్ హోల్డర్ మరణించినట్టయితే నామినీ లేదా చట్టబద్ధమైన వారసులు ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్ యూనిట్లను విక్రయించుకోవచ్చు. మరణించిన వ్యక్తి పెట్టుబడి పెట్టిన నాటి నుంచి ఏడాది పూర్తయిన తర్వాతే ఇందుకు అవకాశం ఇస్తారు. నామినీ లేదా వారసులు ఆ పెట్టుబడి కోసం మూడేళ్ల లాకిన్ పీరియడ్ ముగిసే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదు. చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు లాకిన్ పీరియడ్ అనేది ఉండదు. కానీ ఈఎల్‌ఎస్‌ఎస్ పథకాలకు మూడేళ్ల లాకిన్ ఉంటుంది.
పెట్టుబడిదారుడికి కేటాయించిన తేదీ నుంచి మూడేళ్లు అమలవుతుంది. ఈ మూడేళ్ల తర్వాతే సదరు ఇన్వెస్టర్ తన పెట్టుబడిని వెనక్కి తీసుకోగలరు. యూనిట్ హోల్డర్ మరణించిన సందర్భాల్లో మాత్రం నామినీ లేదా చట్టబద్ధ వారసులు వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. దీన్ని ట్రాన్స్‌మిషన్ అని చెబుతారు. నామినీ లేదా వారసులకు యూనిట్లు బదిలీ అయిన వెంటనే వాటిని విక్రయించుకోవచ్చు. లేదా వేరొకరికి బదిలీ చేసుకోవచ్చు. లేదా తనఖా కూడా పెట్టుకోవచ్చు.
ఉదాహరణకు ఎక్స్ అనే వ్యక్తి 2021లో ఈఎల్‌ఎస్‌ఎస్ పథకంలో ఇన్వెస్ట్ చేసిన తత్వాత 2022లో మరణించాడని అనుకుంటే.. అప్పుడు నామినీ లేదా వారసులు తమ పేరిట సదరు యూనిట్లను మార్పించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వాటిని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. బదిలీ అయిన తర్వాత నుంచి ఏడాది ఆగక్కర్లేదు. మొదట పెట్టుబడి పెట్టిన తేదీ నుంచి ఏడాది కాలం పూర్తయితే చాలు.
ఎన్‌పీఎస్‌లో జీ సెక్యూరిటీలు (ప్రభుత్వ సెక్యూరిటీలు) కంటే కార్పొరేట్ ఫండ్ ఆప్షన్ అన్ని వేళలా మెరుగైనదేనా? ఎన్‌పీఎస్ ఫండ్ మేనేజర్లు భద్రత ఉండే కార్పొరేట్ బాండ్లలోనే ఇన్వెస్ట్ చేస్తారా? – జగన్నాథ్ గోస్వామి
కార్పొరేట్ బాండ్ ప్లాన్లు సాధారణంగా మెరుగైన రాబడులు ఇస్తాయి. అయితే కార్పొరేట్ బాండ్ లేదా ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఎంపిక ఎప్పుడైనా కేవలం రాబడుల అంశం ఆధారంగా ఉండకూడదు. రిస్క్ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని చూడాలి. పెట్టుబడుల క్రెడిట్ నాణ్యతను చూడాలి. మారుతున్న వడ్డీ రేట్లకు ఏ మేరకు ప్రభావితం అవుతాయనేది చూడాలి. నాణ్యత పరంగా చూస్తే ప్రభుత్వం బాండ్ ప్లాన్లు మెరుగైనవి. అవి సావరీన్ బాండ్లలోనే ఇన్వెస్ట్ చేస్తాయి.
అవి అంతర్లీనంగా ప్రభుత్వ గ్యారంటీతో ఉంటాయి. కార్పొరేట్ బాండ్ ప్లాన్లు ఏఏఏ రేటెడ్, ఏఏప్లస్, ఏ1ప్లస్ రేటెడ్ బాండ్లలో పెట్టుబడులు పెడుతుంటాయి. టర్మ్ డిపాజిట్లను సైతం ఎంపిక చేసుకుంటాయి. ఏఏఏ రేటెడ్ సాధనం అయినప్పటికీ, తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో చెల్లింపుల్లో విఫలం కావచ్చు. అందుకుని పెట్టుబడికి భద్రత దృష్ట్యా కార్పొరేట్ ప్లాన్ల కంటే ప్రభుత్వ సెక్యూరిటీలే మెరుగైనవి. బాండ్లు అన్నవి మారే వడ్డీ రేట్ల ప్రభావానికి లోనవుతుంటాయి. పోర్ట్‌ఫోలియోలో ఉన్న బాండ్ల కాల వ్యవధి ఆధారంగా వడ్డీ రే ట్ల అస్థిరతల ప్రభావం ఉంటుంది.
కార్పొరేట్ ప్లాన్ లో ఒక్కో బాండ్ సగటు కాల వ్యవధి ఐదు నుంచి ఏడేళ్ల వరకు ఉంటుంది. ప్రభుత్వ ప్లాన్ అయితే కాల వ్యవధి సాధారణంగా పదేళ్లు ఉంటుంది. అందుకే వడ్డీ రేట్ల మార్పులకు ప్రభుత్వ ప్లాన్లు మరింత ఒత్తిడికి లోనయ్యే స్వభావంతో ఉంటాయి. దీర్ఘకాల సా ధనం కనుక ఈ అస్థిరతలకు ఆందోళన చెందక్క ర్లేదు. కనుక కార్పొరేట్ డెట్ ప్లాన్ అన్నివేళలా ప్రభు త్వ సెక్యూరిటీల కంటే మెరుగైనది అని చెప్పలేం.
Comments
Please login to add a commentAdd a comment