Here is Why Apple and Google Making their Own Processors- Sakshi
Sakshi News home page

చిప్‌ల తయారీలోకి ఆపిల్‌, గూగుల్‌.. ఏమిటీ వివాదం?

Published Mon, Aug 9 2021 7:18 PM | Last Updated on Tue, Aug 10 2021 10:35 AM

Why Apple, Google Making Its Own Microprocessors Interesting Facts in Telugu - Sakshi

ఎవరనుకున్నారు...????
అమెరికా అమలాపురాలను ఒక్క ఫోన్‌ కాల్‌ కలిపేస్తుందని!
ఆఫీసు, ఇల్లు, సినిమాహాలు, ఒలింపిక్‌ క్రీడలు...
అరచేతిలో ఇమిడిపోతాయని!!
గుడిలో, బడిలో.. వాషింగ్‌మెషీన్‌లో.. 
నడిపే వాహనంలో, తళుకుల బల్బుల్లో.. 
ఇందుగలదందు లేదన్న సందేహంబు వలదన్నట్టు...
చిప్‌లు చేరిపోతాయనీ.. సుఖసౌఖ్యాలను మన దరికి చేరుస్తాయని!!
మనిషి మేధకు తాజా తార్కాణమా అన్నట్లు..
యాభై ఏళ్ల క్రితం మొదలైన మైక్రోప్రాసెసర్‌ ప్రస్థానం...
గతం... ప్రస్తుతం.. భవిష్యత్తు...!!!  

‘‘స్పర్ధయా వర్ధతే విద్య’’ అంటుంది ఓ సంస్కృత నానుడి. పోటీ ఉంటేనే విద్యలో రాణించగలం అని అర్థం. మరి.. పోటీ వ్యాపారంలో ఉంటే? ఇంకొన్నేళ్లలో మనకు ఇది కూడా స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటారా? పీసీ, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్‌లకు అత్యంత కీలకమైన మైక్రోప్రాసెసర్ల తయారీలో ఇప్పుడు పోటీ నెలకొంది కాబట్టి! మైక్రోప్రాసెసర్ల గతం... ప్రస్తుతం.. భవిష్యత్తుల గురించి తెలుసుకునే ముందు ఆసక్తికరమైన ఈ పోటీ సంగతేమిటో అర్థం చేసుకుందాం. 


సాక్షి, హైదరాబాద్‌:
నిన్న మొన్నటివరకూ మైక్రోప్రాసెసర్‌ అంటే.. ఇంటెల్‌. ఇంటెల్‌ అంటే మైక్రోప్రాసెసర్‌ అదీ పరిస్థితి. కాలక్రమంలో సాంసంగ్, టీఎస్‌ఎంసీ, క్వాల్‌కామ్, మీడియాటెక్‌ వంటివి పీసీ, స్మార్ట్‌ఫోన్‌ మైక్రోప్రాసెసర్ల తయారీ రంగంలోకి దిగినా ఆధిపత్యం మాత్రం ఇంటెల్‌దే కొనసాగింది. కానీ ఆ పరిస్థితులిప్పుడు మారిపోతున్నాయి. దిగ్గజం ఇంటెల్‌ను తోసిరాజని ఒకవైపు ఆపిల్‌ ఇంకోవైపు గూగుల్‌ రెండూ తమదైన మైక్రోప్రాసెసర్లను తయారు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ రంగంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న క్వాల్‌కామ్‌కూ చెక్‌ పెట్టేందుకు ఆపిల్, గూగుల్‌లు రెండూ పావులు కదుపుతూండటం విశేషం.

ఆపిల్‌ ఇప్పటికే పీసీ, స్మార్ట్‌ఫోన్లు రెండింటికీ సొంతంగా చిప్‌లు తయారు చేసుకుంటున్నా... క్వాల్‌కామ్, ఇంటెల్‌ వంటి సంస్థల చిప్‌లను కూడా కొంతమేరకు ఉపయోగిస్తోంది. త్వరలోనే దీనికీ స్వస్తి చెబుతామని ఆపిల్‌ ప్రకటించింది. మరోవైపు గూగుల్‌ కూడా తన స్మార్ట్‌ఫోన్లు ‘పిక్సెల్‌ –6’, ‘పిక్సెల్‌ –6 ప్రో’లకు సొంతంగా మైక్రోప్రాసెసర్లు తయారు చేసుకుంటామని ప్రకటించింది. ఈ పరిణామం కాస్తా.. మరింత సమర్థమైన ఫోన్లు, క్రోమ్‌బుక్‌లు చౌకధరల్లో వినియోగదారుడికి అందే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

గూగుల్‌ కూడా 2016లో క్వాల్‌కామ్‌ సరఫరా చేసే చిప్‌లతో పిక్సెల్‌ బ్రాండు స్మార్ట్‌ఫోన్లను తయారు చేస్తూండగా.. వీటి ధరల విషయంలో పలు విమర్శలు వచ్చాయి. సొంతంగా చిప్‌లు తయారు చేసుకుంటే తాము అనుకున్న ఫీచర్లను స్మార్ట్‌ఫోన్ల ద్వారా అందించే వీలుంటుందని కంపెనీ భావిస్తోంది. కృత్రిమ మేధ, రియల్‌టైమ్‌ లాంగ్వేజ్‌ ట్రాన్స్‌లేషన్‌ వంటి కొత్త కొత్త టెక్నాలజీలను తమ చిప్‌ల ద్వారా అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.


ఏమిటీ వివాదం

కంప్యూటర్లకు మాత్రమే కాదు.. స్మార్ట్‌ఫోన్లకు, ట్యాబ్లెట్లకు, ఇతర ఆపిల్‌ ఉత్పత్తులకు కొంతకాలం క్రితం వరకూ ఇంటెల్, క్వాల్‌కామ్‌లే అందించేవి. అయితే ఆపిల్, గూగుల్‌ల అవసరాలకు తగ్గట్టుగా ఎక్కువ సామర్థ్యంతో ఉన్న చిప్‌లను తయారు చేయడంలో ఇంటెల్‌ కొన్నేళ్లుగా వెనుకబడటం, ఇతర కంపెనీల చిప్‌లను వాడటంలో ఉన్న కొన్ని పరిమితులను దృష్టిలో ఉంచుకుని ఆపిల్, గూగుల్‌ రెండూ సొంతంగా చిప్‌లు తయారు చేసుకోవాలని తీర్మానించుకున్నాయి. పీసీ, స్మార్ట్‌ఫోన్లు రెండింటికీ సొంతంగా చిప్‌లు తయారు చేసుకున్న ఆపిల్‌ స్మార్ట్‌ఫోన్లలోని మెడెమ్‌లు, ఇతర పరికరాల కోసం మాత్రం క్వాల్‌కామ్‌పైనే ఆధారపడుతోంది. కానీ ధరలు ఎక్కువగా ఉండటం, కొన్ని గుత్తాధిపత్య ధోరణిల కారణంగా వీటిని కూడా సొంతంగా తయారు చేసుకోవాలని రెండేళ్ల క్రితం ప్రయత్నాలు మొదలుపెట్టింది. 


అంత సులువా?

మైక్రోప్రాసెసర్ల తయారీ అంత ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరమవుతాయి. ఇసుక నుంచి సిలికాన్‌ను తయారు చేసే ఫౌండ్రీలను ఏర్పాటు చేయడం మొదలుకొని మిల్లీమీటర్ల సైజున్న చిప్‌లలో వెయ్యికోట్లకుపైగా ట్రాన్సిస్టర్లను ఇమడ్చేలా డిజైన్‌లు తయారు చేయాలంటే ఏళ్లుపూళ్లవుతాయి. ఆపిల్‌ పీసీ చిప్‌ల తయారీలో విజయం సాధించినా స్మార్ట్‌ఫోన్లతో వ్యవహారం అంత సులువు కాదని నిపుణులు అంటున్నారు. ఇంటెల్‌ నుంచి కొను గోలు చేసిన మోడెమ్‌ తయారీ కేంద్రం సాయంతో సొంత తయారీ మొదలుపెట్టనుంది. కాకపోతే చిప్‌ల తయారీతోపాటు క్వాల్‌కామ్‌ స్మార్ట్‌ఫోన్‌ టెక్నాలజీలపై విస్తృత పరిశోధనలు, పరీక్షలు చేస్తూండటం, ప్రమాణాలను నిర్ణయించడంలో చాలా ముందున్న కారణంగా 5జీ ఫోన్ల విషయంలో మాత్రం క్వాల్‌కామ్‌పై ఆధారపడాల్సి ఉంటుందని అంచనా. ఏతావాతా.. ఆపిల్‌ తనదైన స్మార్ట్‌ఫోన్‌ చిప్‌లను తయారు చేసుకునేందుకు మరికొంత సమయం పట్టనుందన్నమాట. 


లక్షల కోట్ల వ్యవహారం! 

మైక్రోప్రాసెసర్‌ తయారీ మార్కెట్‌ విలువ ఎకాఎకిన కొన్ని లక్షల కోట్ల వరకూ ఉంటుంది. ఇంటెల్, మోటరోలా, అడ్వాన్స్‌డ్‌ మైక్రో డివైజెస్, ఐబీఎం, సన్‌ మైక్రోసిస్టమ్స్, హ్యూలెట్‌ ప్యాకర్డ్‌ వంటి దిగ్గజాలు కొన్ని వందల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టడమే కాకుండా.. పోటాపోటీగా మరింత సమర్థమైన, మెరుగైన ఫీచర్లు ఉన్న మైక్రోప్రాసెసర్లను అందుబాటు లోకి వెచ్చాయి. యాభై ఏళ్ల క్రితం నాటి తొలి మైక్రోప్రాసెసర్‌లో కేవలం 2300 ట్రాన్సిస్టర్లు ఉంటే.. తాజాగా ఈ సంఖ్య 1600 కోట్లకు చేరిపోయిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చూ. అది కూడా ఒక చదరపు సెంటీమీటర్‌ వైశాల్యంలోనే ఇన్ని కోట్ల ట్రాన్సిస్టర్లను ఇమడ్చేందుకు ఎంత సాంకేతిక పరిజ్ఞానం, డిజైన్, పరికరాలు అవసరమవుతాయో ఊహించుకోవచ్చు. ఇలా తయారైన మైక్రోప్రాసెసర్లు పీసీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లతోపాటు పరిశ్రమల్లో, వాహనాల్లో, దైనందిన వాడకంలో ఉండే ఎలక్ట్రానిక్‌ పరికరాల్లోకీ చేరిపోయాయి. ఇంత విస్తృత వాడకం ఉన్న కారణంగానే మైక్రోప్రాసెసర్ల మార్కెట్‌ విలువ ఏడాదికి దాదాపు రూ.6.75 లక్షల కోట్లు ఉంది. కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ ఏడాది వృద్ధి 6.4 శాతం వరకూ ఉండవచ్చునని అంచనా. 2021 చివరకల్లా మార్కెట్‌ రూ.7 లక్షల కోట్లకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.
 

స్మార్ట్‌ఫోన్లు,  ట్యాబ్లెట్లదే హవా..

మైక్రోప్రాసెసర్ల రంగంలో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లలో వేగంగా వృద్ధి కనపడుతోంది. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు బలంగా ఉండటం, ప్రజల వద్ద ఖర్చు పెట్టేందుకు ఉండే ఆదాయం పెరుగుతూండటం నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ల విక్రయాలు పెరుగుతూండటం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు 2019లో సగటు అమెరికన్‌ చేతిలో ఖర్చు పెట్టేందుకు సగటున 15 వేల డాలర్లు ఉంటే అది గత ఏడాది అక్టోబరు నాటికి 47,673 డాలర్లకు చేరినట్లు కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. భారత్, చైనా వంటి దేశాల్లోనూ మధ్యతరగతి ప్రజలు ఎలక్ట్రానిక్‌ పరికరాలపై పెడుతున్న ఖర్చు ఎక్కువవుతూండటం మైక్రోప్రాసెసర్‌ రంగానికి వరంగా మారుతోంది. ఒక్క భారత్‌లోనే వచ్చే ఏడాదికల్లా స్మార్ట్‌ఫోన్లు ఉన్న వారి సంఖ్య 82 కోట్లకు చేరుతుందని అంతర్జాతీయ సంస్థ కేపీఎంజీ లెక్కకడుతోంది. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వాడకం పెరిగిన కొద్దీ అందులోనూ చిప్‌ల వాడకం ఉన్న కారణంగా మైక్రోప్రాసెసర్‌ రంగం వృద్ధి వేగంగా సాగుతుందని అంచనా. 


దిగ్గజ తయారీదారులు వీరే...

మైక్రోప్రాసెసర్ల తయారీలో తైవాన్‌కు చెందిన మీడియాటెక్, దక్షిణ కొరియాకు చెందిన సాంసంగ్, జపాన్‌లోని తోషిబాలు కలసి అమెరికా బయట ఆధిపత్యం కనబరుస్తున్నాయి. మొత్తమ్మీద చూస్తే అమెరికన్‌ కంపెనీ ఇంటెల్‌దే తొలిస్థానం. మార్కెట్‌ దీని షేర్‌ 19.5 శాతంగా ఉంది. తైవాన్‌ సెమీ కండక్టర్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ కంపెనీ 11.25 శాతంతో రెండో స్థానంలోనూ, దాదాపు 10 శాతంతో మూడోస్థానంలో క్వాల్‌కామ్‌ ఉన్నాయి. సాంసంగ్‌ సెమీ కండక్టర్, బ్రాడ్‌కామ్, ఫ్రీస్కేల్‌ సెమీ కండక్టర్, ఎన్‌విడియా, ఏఎండీ, స్ప్రెడ్‌ట్రమ్, టీఐ, ఆపిల్, ఐబీఎం, ఆట్మెల్, టీఎస్‌ఎంసీ, లీడ్‌కోర్, ఆమ్‌లాజిక్, నూఫ్రంట్, ఇన్‌జెనిక్‌ వంటి కొన్ని కంపెనీలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి.

మైక్రో ప్రాసెసర్‌ సెగ్మెంట్‌ను స్థూలంగా మూడు భాగాలుగా విడదీయవచ్చు. ఆర్మ్, ఎక్స్‌–86 ఆధారిత ఎంపీయూలు ఒక వర్గమైతే.. అప్లికేషన్ల ఆధారంగా చేసే వర్గీకరణ (పీసీలు, సర్వర్లు, ట్యాబ్లెట్లు, సెల్‌ఫోన్‌లు, ఎంబెడెడ్‌ ఎంపీయూలు) రెండోది. ఉపయోగించే రంగం ఆధారంగా జరిగే మూడో వర్గీకరణలో సమాచారం, కన్సూ్యమర్‌ ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, మ్యానుఫ్యాక్చరింగ్‌ వంటివి ఉంటాయి. స్మార్ట్‌ఫోన్లలో మాత్రం క్వాల్‌కామ్‌ పెత్తనం కొనసాగుతోంది. 2020 లెక్కల ప్రకారం స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌ ప్రాసెసర్‌ రంగంలో క్వాల్‌కామ్‌ 32 శాతం ఆదాయాన్ని దక్కించుకుంది.  చైనాకు చెందిన హైసిలికాన్‌ 22 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఆపిల్‌ 19 శాతంతో మూడో స్థానంలో ఉండగా.. మిగిలిన అన్ని సంస్థలు కలిసి 27 శాతం వాటా కలిగి ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement