బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 10 గ్రాముల పసిడి రూ.80,000, కేజీ సిల్వర్ రూ. 1 లక్ష దాటేసింది. ధరలు భారీగా పెరిగినప్పటికీ.. గోల్డ్ కొనుగోలు చేసేవారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ధన త్రయోదశి సందర్భంగా బంగారం ఎక్కువగానే అమ్ముడైనట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
పరిస్థితులను బట్టి చూస్తుంటే.. ధరలు ఎంత పెరిగినా కొనుగోలుచేసి వారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదని స్పష్టమైపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది దసరా, దీపావళి నాటికి గోల్డ్ రేటు రూ. 1 లక్షకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వెండి కూడా రూ. 1.25 లక్షల నుంచి రూ. 1.30 లక్షలకు చేరుకోవచ్చని అంచనా.
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రకారం.. గత కొన్నేళ్లుగా వెండి మంచి లాభాలను ఇవ్వడంతో ధరల విషయంలో బంగారాన్నే మించిపోయింది. రాబోయే రోజుల్లో బంగారం కంటే వెండి అమ్మకాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని సమాచారం.
2014లో రూ.28,006.50 వద్ద ఉన్న బంగారం ధర ప్రస్తుతం రూ. 81000 వరకు ఉంది. దీన్ని బట్టి చూస్తే.. పదేళ్లలో బంగారం ధర ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టమవుతోంది.
బంగారం ధరలు పెరగటానికి కారణం
బంగారం ధరలు భారీగా పెరగటానికి ప్రధాన కారణం కొనుగోలుదారుల సంఖ్య పెరగడం. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పలు దేశాల సెంట్రల్ బ్యాంకుల రేట్లు పెరగడం వంటివి ప్రధాన కారణం అవుతున్నాయి. స్టాక్ మార్కెట్లు పతనమైన సమయంలో.. ఎక్కువమంది ఇన్వెస్టర్లు నష్టాల నుంచి తప్పించుకోవడానికి బంగారం మీద పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టారు. ఓ వైపు పండుగలు, మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా బంగారం అమ్మకాల పెరగటానికి కారణమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment