న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్ (జీల్) – సోనీ భారత విభాగం విలీన ప్రయత్నాలకు బ్రేక్ పడనున్నట్లు తెలుస్తోంది. విలీన సంస్థకు జీ సీఈవో పునీత్ గోయెంకా సారథ్యం వహించే విషయంపై సోనీ సుముఖంగా లేకపోవడమే ఇందుకు కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో నిర్దిష్ట షరతులను పాటించలేదనే కారణంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని సోనీ గ్రూప్ భావిస్తున్నట్లు తెలిపారు.
డీల్ కుదుర్చుకునేందుకు నిర్దేశించుకున్న గడువు కన్నా ముందే జనవరి 20లోగా రద్దు నోటీసును పంపించే అవకాశం ఉందని వివరించాయి. వివరాల్లోకి వెళ్తే.. జపాన్ దిగ్గజం సోనీ గ్రూప్ తమ భారత విభాగాన్ని, జీల్‌ను విలీనం చేసేందుకు సంబంధించి 2021లో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది సాకారమైతే దేశీయంగా 10 బిలియన్ డాలర్ల మీడియా దిగ్గజంగా విలీన సంస్థ ఆవిర్భవిస్తుంది. సదరు ఒప్పందం ప్రకారం జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర తనయుడు, సీఈవో పునీత్ గోయెంకానే విలీన సంస్థకు కూడా సారథ్యం వహించాలి.
కానీ, ఈలోగా చంద్ర, గోయెంకాలు తమ అధికారాన్ని దురి్వనియోగం చేసి సొంత అవసరాల కోసం నిధులను మళ్లించారంటూ సెబీ ఆరోపించడంతో డీల్ పురోగతిపై సందేహాలు రేకెత్తాయి. అయితే, ఈ మొత్తం వ్యవహారాన్ని కార్పొరేట్ గవర్నెన్స్‌పరమైన వివాదంగా పరిగణిస్తున్న సోనీ.. విలీన సంస్థ సారథ్య బాధ్యతలను గోయెంకాకు అప్పజెప్పడానికి విముఖంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కానీ, ముందుగా అనుకున్న ప్రకారం సీఈవోగా తనని కొనసాగించాల్సిందేనంటూ గోయెంకా పట్టుబడుతున్నట్లు వివరించాయి. ఈ నేపథ్యంలోనే డీల్‌ను సోనీ రద్దు చేసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment