సాక్షి, బెంగళూరు: ప్రముఖ ఫుడ్ డెలీవరీ సంస్థ జొమాటో మరోసారి వివాదంలో ఇరుక్కుంది. తాజాగా జొమాటో డెలివరీ బాయ్ ఒక మహిళపై దాడికి పాల్పడ్డాడు. స్వల్ప వివాదంతో ఆమెపై రక్తమొచ్చేలా అనుచితంగా దాడిచేశాడు. దీంతో తన అనుభవాన్ని ఇన్‌స్టాలో షేర్ చేశారు. బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ హితేషా చంద్రానీ నెత్తురోడుతున్న ముఖంతో ఉన్న వీడియోను అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్‌లో సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే మార్చి 9 న మధ్యాహ్నం 3.30 గంటలకు ఆర్డర్ ఇచ్చానంటూ హితేషా తన అనుభవాన్ని వెల్లడించారు. సాయంత్రం 4.30 గంటలకు డెలివరీ చేయాల్సి ఉందని, అయితే సమయానికి ఆర్డర్ రాలేదని ఆమె ఆరోపించారు. దీంతో ఆర్డర్ ఆలస్యం కావడంపై కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడి, తన ఆర్డర్ క్యాన్సిల్ చేయాలని బెంగళూరుకు చెందిన కంటెంట్ సృష్టికర్త మేకప్ ఆర్టిస్ట్ హితేషా కోరింది. ఇంతలోనే డెలివరీ బాయ్‌ఆర్డర్ తీసుకొని వచ్చాడు. ఈ సందర్భంగా వాదనకు దిగిన డెలివరీ ఎగ్జిక్యూటివ్ కామరాజ్ ఆగ్రహంతో ఘర్షణకు దిగాడు. బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై పిడిగుద్దులు కురిపించాడు. తరువాత ఆర్డర్‌ను తీసుకొని మరీ పారిపోయాడని ఆమె తెలిపారు. దీనికి సంబంధించి ఒక వీడియోను పోస్ట్ చేశారు. జొమాటో సేవలు సురక్షితమేనా అంటూ వాపోయారు. దయచేసి తనకు మద్దతుగా నిలవాలంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
క్షమించండి : జొమాటో
మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించిన జొమాటో విచారం వ్యక్తం చేసింది. హితేషాకు క్షమాపణలు తెలిపింది. ఆమెకు అవసరమైన వైద్య సహాయంతోపాటు, దర్యాప్తునకు సహకరిస్తున్నామని పేర్కొంది. అలాగే సంబంధిత డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ను తొలగించామని, భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా జాగ్రత్త పడతామని హామీ ఇచ్చింది.
నిందితుడి అరెస్ట్
డెలివరీ ఎగ్జిక్యూటివ్ వెర్షన్ వేరేలా ఉందని బెంగళూరు పోలీసులు తెలిపారు. డెలివరీ ఆలస్యం కావడంతో డబ్బులు రిఫండ్ కావాలని డిమాండ్ చేయడంతో, అంత డబ్బు తన దగ్గర లేదని చెప్పానన్నాడని తెలిపారు. దీంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగిందన్నారు. ఈ క్రమంలో ఆమె చెప్పులతో తనను కొట్టడానికి ప్రయత్నించినప్పుడు, ఆత్మరక్షణలో భాగంగా నెట్టడంతో ఆమెకు గాయమైందన్నాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేశామని, దర్యాప్తు జరుగుతోందని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు
Comments
Please login to add a commentAdd a comment