న్యూఢిల్లీ: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో మొదటిసారి ఓ త్రైమాసికంలో లాభాలను నమోదు చేసింది. జూన్‌తో అంతమైన మూడు నెలల కాలానికి రూ.2 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ రూ.186 కోట్లు నష్టపోవడం గమనార్హం. కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.1,414 కోట్ల నుంచి రూ.2,416 కోట్లకు చేరింది. వ్యయాలు సైతం రూ.1,768 కోట్ల నుంచి రూ.2,612 కోట్లకు పెరిగాయి. ఈ ఫలితాల్లో బ్లింకిట్ గణాంకాలు సైతం కలిసే ఉన్నాయి.
విడిగా ఫుడ్ డెలివరీ ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,470 కోట్ల నుంచి రూ.1,742 కోట్లకు పెరిగింది. హైపర్ ప్యూర్ ఆదాయం రూ.273 కోట్ల నుంచి రూ.617 కోట్లకు పెరిగింది. బ్లింకిట్ ఆదాయం రూ.164 కోట్ల నుంచి రూ.384 కోట్లకు పెరిగింది. వ్యాపారం పెద్ద సంక్లిష్టతలు లేకుండా నిర్వహించేందుకు తాము ఎంతో కష్టపడి పనిచేస్తున్నట్టు జొమాటో వ్యవస్థాపకుడు, ఎండీ, సీఈవో దీపిందర్ గోయల్ వాటాదారులకు రాసిన లేఖలో తెలిపారు. వచ్చే నాలుగు త్రైమాసికాల్లో మొత్తం వ్యాపారం వ్యాప్తంగా లాభాలను ఆర్జిస్తామని ప్రకటించారు.
ఇక ముందు తమ వ్యాపారం లాభసాటిగానే కొనసాగుతుందని జొమాటో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అక్షంత్ గోయల్ తెలిపారు. వచ్చే కొన్నేళ్లపాటు తాము ఏటా 40 శాతానికి పైగా ఆదాయంలో వృద్ధిని సాధిస్తామని ప్రకటించారు. వచ్చే పదేళ్లలో జొమాటో కంటే బ్లింకిట్ వాటాదారులకు ఎక్కువ విలువ తెచ్చి పెడుతుందని దీపిందర్ గోయల్ పేర్కొన్నారు. కొన్ని పట్టణాల్లో జొమాటో స్థూల ఆర్డర్ విలువ సమీపానికి బ్లింకిట్ స్థూల ఆర్డర్ విలువ చేరినట్టు చెప్పారు. వృద్ధిని కొనసాగించేందుకు, తాము విజయం సాధిస్తామనుకున్న కొత్త వ్యాపార అవకాశాలను పరిశీలిస్తూనే ఉంటామన్నారు.
ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో జొమాటో షేరు 2 శాతం లాభపడి రూ.86 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment