చిత్తూరు అర్బన్: ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద రెండో సహకార పాల డెయిరీగా పేరుగాంచిన చిత్తూరు విజయా డెయిరీ ఎందుకు మూతబడింది? ఏ ప్రభుత్వ హయాంలో విజయా డెయిరీని మూయించారు? నాటి పాలకులు చేసిన తప్పిదాలు ఏంటి? డెయిరీ మూత వెనుక జరిగిన కుట్ర ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ పచ్చ మీడియాకు సమాధానాలు తెలుసు. కానీ ఎక్కడా వాటిని ప్రస్తావించదు.
ఎల్లో మీడియా ఎందుకు ప్రస్తావించదంటే..
కారణం.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చంద్రబాబునాయుడు చేసిన కుట్ర. ఇది జగమెరిగిన సత్యం. అలాంటి డెయిరీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ధరిస్తుంటే ‘పచ్చ మీడియా’ ఓర్చుకోవడంలేదు. డెయిరీ ఎదుట ఉన్న వీరరాఘవులునాయుడు విగ్రహం పడేశారంటూ గోల చేస్తూ తప్పుడు కథనాలు వార్చి వడ్డిస్తోంది.
డెయిరీ మూసివేత కుట్రకు నాంది
చంద్రబాబు నాయుడు సహకార శాఖ మంత్రిగా పనిచేసే రోజుల్లో ఓసారి చిత్తూరు విజయా డెయిరీని సందర్శించారు. అప్పటికి రోజుకు 4 లక్షల లీటర్ల మేరకు పాల సేకరణ జరుగుతుండేది. డెయిరీలో ప్రత్యక్షంగా దాదాపు 800 మంది ఉద్యోగులు పనిచేస్తుంటే, పరోక్షంగా 2 లక్షలకు పైగా కార్మికులు విధులు నిర్వర్తించే వారు. చిత్తూరు విజయా పాల డెయిరీ నుంచి డిల్లీ, పూణే, బాంబే తదితర మహా నగరాలకు రోజుకు 2 లక్షల లీటర్ల మేరకు పాలను తరలించడం గమనించిన బాబు మదిలో ఓ కుట్ర పురుడుపోసుకుంది.
హెరిటేజ్ పుట్టిందే ఆ కుట్ర నుంచి..
అదే ఆయన మానస పుత్రిక హెరిటేజ్ పాల డెయిరీ స్థాపన. హెరిటేజ్‌ను స్థాపించాలంటే సహకార రంగంలో పాతుకుపోయిన విజయా పాల డెయిరీని మూయించాలని నిర్ణయించుకున్నారు. తనకు నమ్మిన బంటుగా ఉన్న చిత్తూరు టీడీపీ నేత దొరబాబునాయుడును విజయా పాల డెయిరీకి చైర్మన్‌గా నియమించుకున్నారు. మరో కుడిభుజం జీవరత్నం నాయుడును మేనేజర్‌గా నియమించుకుని విజయా డెయిరీకి వచ్చే పాలను తన డెయిరీకు మళ్లించుకున్నారు.
జాగ్రత్తగా డెయిరీని మూత వేయించారు
విజయా డెయిరీలో పాల పౌడర్, నెయ్యి లాంటి పదార్థాలు అమ్ముడుపోవడం లేదంటూ, భారీ నిల్వలను ఉంచేశారు. విజయా డెయిరీకి పాల సేకరణ ఎక్కువగా ఉందంటూ వారానికి రెండు రోజులు చొప్పున మిల్క్ హాలిడేను ప్రకటించారు. రైతులకు క్రమంగా పాల ధరలను తగ్గిస్తూ, ఇదే సమయంలో హెరిటేజ్‌లో 20 పైసలు అదనంగా ఇస్తామని ఆశ చూపించి పాలను మళ్లించుకున్నాడు.
ముందు నష్టాలు.. తర్వాత లాకౌట్
ఆఖరికి డెయిరీలో భారీ నష్టాలు చూపించి 2002 ఆగస్టు 31వ తేదీన లాకౌట్ ప్రకటించి పూర్తిగా డెయిరీని మూసివేశారు. ఆ సమయంలో డెయిరీ చైర్మన్‌గా ఉన్న దొరబాబు నాయుడు పూర్తిగా చంద్రబాబు నాయుడి కుట్రలకు తోడ్పాటు అందించారు. విజయా పాల డెయిరీపై ఆధారపడ్డ లక్షలాది మంది రైతులను, డెయిరీలో పనిచేస్తున్న వందలాది కుటుంబాలను రోడ్డున పడేశారు.
విగ్రహాన్ని భద్రంగా ఉంచాం..
ప్రభుత్వం విజయ డెయిరీని పునఃప్రారంభించనున్న నేపథ్యంలో గేటు ముందు దారిలో అడ్డుగా ఉన్న వీర రాఘవులు నాయుడు విగ్రహాన్ని జాగ్రత్తగా తీసి భద్రపరిచామని నగర కమిషనర్ అరుణ మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా తీసిన విగ్రహ ఫొటోలను చూపించారు. విగ్రహాన్ని ఎక్కడా పడేయలేదని స్పష్టం చేశారు.
పచ్చ మీడియా దాచిన చరిత్ర
1969లో సహకార కార్పొరేషన్ ఆధ్వర్యంలో చిత్తూరు విజయా డెయిరీని ప్రారంభించారు. అప్పట్లో రోజుకు 3 వేల లీటర్లు పాలు సేకరించేవారు. ఈ పాలను చిత్తూరు, తిరుపతి నగరాల్లో విక్రయించేవారు. 1977–78 నుంచి తిరుమల శ్రీవారికి అభిషేకానికి కూడా విజయా డెయిరీ పాలను సరఫరా చేసేవారు. తిరుమలలోని పలు హోటళ్లు, క్యాంటీన్లకు సైతం ఇక్కడి నుంచి పాలు వెళ్లేవి.
ఘనచరిత్ర చిత్తూరు డెయిరీది
1980లో పాలకోవా, రోస్‌మిల్క్ తయారు చేసే యూనిట్లను ఏర్పాటు చేశారు. అప్పటికీ రోజుకు 50 వేల లీటర్ల పాలసేకరణ జరిగేది. కాల క్రమేణా తిరుమలకు నెలకు రూ.కోటి మేరకు నెయ్యి సరఫరా చేయడంతో పాటు, పాల కోవా, రోస్ మిల్క్ విక్రయాలను చిత్తూరు, తిరుపతి, తిరుమలలో పుంజుకున్నాయి. విజయా డెయిరీ నుంచి తయారుచేసిన పాల పౌడర్‌ను మిలిటరీ క్యాంటీన్లకు తరలించేవారు.
లక్షల కుటుంబాల జీవన ధార
రోజు రోజుకూ విజయా డెయిరీకి పాలసేకరణ సామర్థ్యం పెరగడంతో జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల పాడి రైతు కుటుంబా లు రోజుకు దాదాపు 4 లక్షల లీటర్ల మేరకు పాలను సరఫరా చేసేవి. గ్రామాల్లో పాడి రైతులతో కూడిన పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను ఏర్పాటు దాదాపు 850 గ్రామాల్లో పాల ఉత్పత్తి దారుల సంఘం కింద పాల సేకరణ భవనాలను నిర్మించారు.
ఇపుడు డెయిరీ తెరుస్తుంటే..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాడి రైతులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు. ఇందులో భాగంగా శిథిలావస్థలో ఉన్న విజయా డెయిరీని పునరుద్ధరించే క్రమంలో స్థలాన్ని అమూల్ సంస్థకు 99 ఏళ్లపాటు లీజుకు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైతుల నుంచి పాలను సేకరించి గిట్టుబాటు ధర కల్పించడానికి చేస్తున్న ప్రయత్నంలో అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
వీర రాఘవుల విగ్రహానికి సముచిత స్థానం
డెయిరీ మాస్టర్ ప్లాన్ ప్రకారం వీరరాఘవులునాయుడు విగ్రహానికి సముచిత స్థానం కల్పిస్తామని మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణ ఇప్పటికే స్పష్టం చేశారు. విగ్రహాన్ని పడేశామని, మూలనచుట్టి ఎక్కడికో తరలించారంటూ వచ్చిన కథనాలను ఆమె ఖండించారు. మరోవైపు డెయిరీని మూయించిన దొరబాబు నాయుడు.. చిత్తూరు కలెక్టర్‌ను కలిసి డెయిరీ ఎదుట వీర రాఘవులు నాయుడు విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని వినతిపత్రం ఇవ్వడం ఈ ఘటనలో కొస మెరుపు.
Comments
Please login to add a commentAdd a comment