చిత్తూరు: ఇంటికి వస్తువులు తీసుకొని ద్విచక్రవాహనంపై బయల్దేరిన విద్యార్థిని కారు రూపంలో మృత్యువు కబళించింది. వడమాలపేట బైపాస్ రోడ్డులోని పాదిరేడు సర్కిల్ వద్ద బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకొంది. పోలీసుల కథనం మేరకు, వడమాలపేట మండలం పాదిరేడు ఎస్సీ కాలనీకి చెందిన తడుకు నవీన్(21) వడమాలపేట నుంచి ఇంటికి ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. చైన్నె నుంచి తిరుపతి వైపు వెళుతున్న ఇనోవా కారు వేగంగా ఢీకొనడంతో నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
కారులోని వ్యక్తులు భయపడి సంఘటనా స్థలంలోనే కారును వదలిపెట్టి పరారయ్యారు. విషయం తెలుసుకొన్న నవీన్ తండ్రి చిట్టిబాబు సంఘటనా స్థలానికి చేరుకొని కొడుకు మృతదేహాన్ని చేతిలోకి తీసుకొని అప్పుడే నూరేళ్లు నిండాయా నవీనా అంటూ గుండెలవిసేలా రోదించారు. మృతుడు పుత్తూరు ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
ఆగ్రహించిన గ్రామస్తులు–ఆగిన వాహనాలు
పాదిరేడు బైపాస్‌గా పిలుస్తున్న సంఘటనా స్థలంలో ఎప్పటి నుంచో స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని పలు గ్రామాల ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడం వల్లే మరో ఘోరం జరిగిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి–చైన్నె జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరి నిలిచిపోయాయి. పుత్తూరు రూరల్ సీఐ సురేష్‌కుమార్ ఆందోళన కారులతో చర్చించి, పాదిరేడు సర్కిల్ వద్ద స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment