తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన 13 మంది వ్యాన్‌లో తిరుమలకు బయలుదేరారు. నగరి మండలం గుండ్రాజుకుప్పం మలుపు వద్ద మితిమీరిన వేగం కారణంగా వాహనం అదుపుతప్పింది. డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోవడంతో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో అంకిత్ (5) అనే బాలుడు మరణించగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఇవి మచ్చుకు రెండే.. రోడ్డు నిబంధనలను అతిక్రమించడం, అతివేగంగా నిర్లక్ష్యంతో వాహనాలు నడపడం, కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఈ ఏడాది ఒక్క నగరి నియోజకవర్గ పరిధిలోనే ఇప్పటి వరకు 43 ప్రమాదాలు జరిగాయి. 33 మంది మృత్యువాత పడగా, సుమారు 40 మంది గాయాలపాలయ్యారు.
చైన్నెకి చెందిన యువరాజ్, నాగజ్యోతి దంపతులు ఇటీవల సింగపూర్ నుంచి ఇండియాకు వచ్చారు. తిరుమల శ్రీవారి దర్శనానికి కారులో బయలుదేరారు. నగరి పట్టణ సమీపంలోని ధర్మాపురం వద్ద వారి కారు డ్రైవర్ ఇళంగోవన్ ముందుగా వెళుతున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసేందుకు రాంగ్‌రూట్‌లోకి ప్రవేశించి ఎదురుగా వస్తున్న ట్యాంకర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముగ్గురూ మృతి చెందారు.
ఒకరి నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాలను దిక్కులేని వారిగా మారుస్తోంది.. ఒకరి దుందుడుకు స్వభావం ఎన్నో జీవితాల్లో చీకట్లు నింపుతోంది.. ఒకరి నిర్లక్ష్యం ఎన్నో బతుకులను శోక సంద్రంలోకి నెట్టేస్తోంది.. నిత్యం రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. తల్లిదండ్రులకు కడుపుకోతను మిగులుస్తున్నారు. భార్యాబిడ్డలను అనాథలుగా మారుస్తున్నారు.. భవిష్యత్‌పై ఆశలను ఆవిరి చేసేస్తున్నారు.
నగరి : అజాగ్రత్త, అతి వేగం పలువురి ఆయుష్షును హరించేస్తోంది. వ్యాపార అవసరాలు, విహారయాత్రలు, వినోదాలు, వేడుకలు, ఉత్సవాలు, జాతరలు తదితర కారణాలతో పలువురు కుటుంబసమేతంగా, మిత్రులతో కలిసి వాహనాల్లో ప్రయాణిస్తుంటారు. ఇలా కలిసికట్టుగా వెళ్లే ప్రయాణాలంటే చాలామంది ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే వారి ఆనందయాత్రలను వాహనాలు నడిపే డ్రైవర్లు క్షణాల్లో అంతిమయాత్రలుగా మార్చేస్తున్నారు. అంతా సజావుగా సాగినప్పుడు పర్లేదు కానీ, దురదృష్టవశాత్తు ఏదైన ప్రమాదం జరిగితే చాలా జీవితాలు తలకిందులవుతుంటాయి. ఇటీవల కాలంలో ఎందరో మైనర్లు, యువకులు, డ్రైవర్లు నిర్లక్ష్యంగా, అతివేగంగా వాహనాలు నడిపి ప్రమాదాల కారణమవుతున్నారు.. తమతోపాటు పక్క వారి ప్రాణాలకు ముప్పు తీసుకువస్తున్నారు. ఇలా ఓ డ్రైవర్ చేసిన తప్పు వల్లే ఆదివారం వడమాలపేట టోల్‌గేట్ వద్ద ప్రమాదం జరిగింది. ఐదుగురి ఆయువును బలితీసుకుంది.
మిన్నంటిన రోదనలు
అంజేరమ్మ కనుమ వద్ద ప్రమాదంలో మరణించివారి బంధువుల రోదనలు మిన్నంటాయి. పుత్తూరు ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాలకు సోమవారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. తమ ఆత్మీయులను విగతజీవులగా చూసిన బంధుమిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. విషణ్ణవదనాలతో మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకుని వెళ్లారు.
షాక్‌తో గుండెఆగింది
జీడీనెల్లూరు మండలం, కొట్రకోనకు చెందిన శివకుమార్ (61) హెరిటేజ్ సంస్థలో లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆయన పెద్ద కుమారుడు ట్రైన్ యాక్సిడెంట్‌లో మృతి చెందాడు. ఒక కుమార్తె, మరో కుమారుడు ఉన్నారు. భార్య అనారోగ్యంతో బాధపడుతుండగా వారి జీవనాధారం శివకుమార్ పైనే ఆధారపడి ఉంది. టోల్‌గేట్ వద్ద జరిగిన ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ప్రమాదానికి గురైన వాహనంలో నుంచి కిందకు దూకడంతో పాటు, అక్కడి విషాద దృశ్యాలను చూసి షాక్‌తో గుండె ఆగిపోయింది. దీంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
విగతజీవిగా ఇంటి పెద్ద..
తిరుపతిలోని గోపాలరాజు కాలనీకి చెందిన గిరిజమ్మ(48) కష్టపడి కొడుకు, కుమార్తెను పోషించుకుంది. ఇద్దరు పిల్లలకు మంచి సంబధాలు కుదిర్చి పెళ్లి కూడా చేసింది. అయినా కుటుంబానికి భారం కాకూడదని సొంతగా రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటోంది. ఈ క్రమంలో రియల్ వ్యాపారులతో ఏర్పడిన పరిచయంతోనే వడమాలపేట అంజేరమ్మ కనుమలో పూజలకు వెళ్లింది. అక్కడ జరిగిన ప్రమాదంలో విగతజీవిగా మారింది.
యమపురికి ‘షార్ట్‌కట్’
టోల్‌గేటు నుంచి అంజేరమ్మ కనుమకు వెళ్లే మార్గంలో పలువురు ఎంచుకుంటున్న షార్ట్‌కట్ దారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ట్రాఫిక్ నిబంధనల మేరకు వెళ్లాల్సిన మార్గంలో కాకుండా ఈ షార్ట్‌కట్‌లో వెళితే కేవలం 5 కిలోమీటర్ల దూరం మాత్రమే తగ్గుతుంది. దీనికోసం చాలామంది రాంగ్‌రూట్‌ను ఎంచుకుని ప్రమాదాల బారిన పడుతున్నారు.
మాకు దిక్కెవరు దేవుడా..
ఐరాల మండలం, కలిగిరిపల్లెకు చెందిన రేవంత్ కుమార్ (26) వడమాలపేట మండలం టోల్‌గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతడికి ఏడాది క్రితమే వివాహమైంది. పది నెలల బిడ్డ ఉంది. గతంలోనే తండ్రి మరణించడంతో తల్లికి, భార్యాబిడ్డలను రేవంత్‌కుమార్ కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఇప్పుడు అతడు మృతి చెందడం ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. మాకు దిక్కెవరు దేవుడా అంటూ కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది.
కనీస జాగ్రత్తలు తప్పనిసరి
వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా కనీస జాగ్రత్తలు పాటించాలి. నిబంధలకు విరుద్ధంగా డ్రైవింగ్ చేసేవారిని హెచ్చరిస్తున్నాం. జరిమానాలు విధిస్తున్నాం. వాహనం నడిపే సమయంలో ట్రాఫిక్ నియమాలను పాటించాలి. డ్రైవర్లు సమర్ధతతో వాహనం నడపాలి. లేకుంటే ప్రయాణించేవారు ప్రాణాలు కోల్పోవడమో, గాయాలపాలు కావడమో జరుగుతుంది. – వి.శ్రీనివాసరావ్, డీఎస్పీ, పుత్తూరు
అధికారుల సూచనలు
► వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్ తన చేతుల్లో పలువరు ప్రయాణికుల ప్రాణాలున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ ఆలోచనతో జాగ్రత్తగా వాహనాన్ని నడపాలి. రోడ్డు భద్రతా నిబంధనలను అతిక్రమించకూడదు.
► వాహనాలు నడిపే సమయంలో నిద్ర వస్తే ఎక్కడైనా వాహనాన్ని నిలుపుకోవాలి. కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ వాహనం నడపాలి.
► మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను నడపకూడదు.
► తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు కొనుగోలు చేసి ఇచ్చే సమయంలోనే రహదారి నిబంధనలపై అవగాహన కల్పించారు. ట్రిపుల్ రైడింగ్, అధిక వేగం, రేసింగ్‌ల జోలికి వెళ్లకూడదని స్పష్టం చేయాలి.
వాహనం నడపాలంటే..
► మోటారు వాహనాల చట్టం1988, సెక్షన్(4) ప్రకారం 18 ఏళ్లలోపువారు మోటార్ వాహనం నడపకూడదు.
► తల్లిదండ్రుల అనుమతితో 16 ఏళ్లు దాటిన వారు 50 సీసీకి మించని ఇంజను సామర్ధ్యం కలిగిన గేర్లులేని మోటారు సైకిల్ లైసెన్స్ పొందవచ్చు.
► ఇరవై ఏళ్లలోపు వ్యక్తులు ట్రాన్స్‌పోర్టు వాహనాలు నడపకూడదు.
Comments
Please login to add a commentAdd a comment