వీఆర్‌ఏల పదోన్నతుల్లో న్యాయం చేయండి
రొంపిచెర్ల : వీఆర్‌ఏలకు ప్రభుత్వం ఇస్తున్న పదోన్నతుల్లో అటెండరు, వాచ్‌మన్, వీఆర్‌ఓలుగా ఇవ్వాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌కు ఉమ్మడి చిత్తూరు జిల్లా వీఆర్‌ఏల సంఘం నాయకులు తిరుపతి కలెక్టరేట్‌లో లక్ష్మణ్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా వెట్టి చాకిరి చేస్తున్నామని తెలిపారు. ప్రమోషన్లలో ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని కోరారు. నేతలు దేవరాజ్, సాంబయ్య, బాల సుబ్రమణ్యం, ఇర్ఫాన్‌అలీ, నాగరాజు, అంకయ్య, హరి, శిరీష పాల్గొన్నారు.
పీఎం విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో అర్హులందరూ పీఎం విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్‌ఎంఈ అడిషనల్ డైరెక్టర్ మూర్తి అన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. పీఎం విశ్వకర్మ పథకం కింద అర్హులైన వారికి అవసరమైన పనిముట్ల కిట్లను సైతం అందిస్తారన్నారు. ఎంపికయ్యే ప్రతి లబ్ధిదారుడికి లక్ష రూపాయల రుణం ఇవ్వడం జరుగుతుందన్నారు. తీసుకున్న రుణం సక్రమంగా చెల్లిస్తే రెండో విడతలో రూ.2 లక్షలు ఇస్తారని చెప్పారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ హరీష్ మాట్లాడుతూ .. అర్హులందరికీ పీఎం విశ్వకర్మ పథకంను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మెప్మా పీడీ రవీందర్, డీఐసీ వెంకటరెడ్డి, డీపీఎంలు రవి, సరిత, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గుణశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
పాఠశాలల విలీనం ఆపాలి : ఎస్టీయూ
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ పాఠశాలల విలీన ప్రక్రియను ఆపాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు మదన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న జీఓ 117 సవరణ ప్రక్రియ సంఘాలతో చర్చించిన అంశాలకు భిన్నంగా చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే మోడల్ పాఠశాలల ఏర్పాటు పేరుతో ప్రస్తుతం చేస్తున్న సమీప పాఠశాలల విలీన ప్రక్రియను నిలిపివేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు చదివే ప్రాథమికోన్నత పాఠశాలలను కొనసాగించాలన్నారు. మోడల్ పాఠశాలలు 60 మంది విద్యార్థులు ఎక్కడ ఉంటే అక్కడ ఏర్పాటు చేస్తామని తొలుత ఉపాధ్యాయ సంఘాలకు చెప్పారన్నారు. కానీ ప్రస్తుతం 40 మంది నుంచి 45 మంది విద్యార్థులకు సమీప ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రాథమిక పాఠశాలలో విలీనం చేసేలా కసరత్తు చేస్తున్నారన్నారు. విలీన ప్రక్రియ ఆపకపోతే ఆందోళనలు చేపడుతామని ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment