కాణిపాకం కీర్తి
హరిత దీప్తి..
ఆ పాఠశాలలోకి వెళుతుంటే..అదేదో మనస్సుకు ఉత్తేజం..ఉల్లాసం కలిగించేలా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపి స్తుంది.. చూస్తుంటే ఏదో మనస్సును ప్ర శాంతత వైపు తీసుకెళ్లే ఉద్యానవనాన్ని తలపిస్తుంది. ఎక్కడ చూసినా పరుచుకున్న పచ్చదనం.. తరగతి గదుల వద్ద ఆకర్షించే పూలకుండీలు.. స్వచ్ఛమైన తాగునీరు, వృథా నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంపొందించడం, ఉపాధ్యాయుల అంకిత భావం, విద్యా ర్థుల తపన, స్థానికులు, దాతల సహకారంతో పాఠశాల ఆవరణ ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. సమష్టిగా కృషి చేస్తే ఫలితం ఎలా ఉంటుందో కాణిపాకం ఉన్నత పాఠశాలే ఇందుకు ని దర్శనం.. దీనికి ఏటా జాతీయ స్థాయిలో హరిత పాఠశాల పురస్కారం రావడం అందరూ గర్వించదగ్గ విషయం.
ఐరాల : మండలంలోని కాణిపాకం ఉన్నత పాఠశాలకు మరోసారి హరిత పురస్కారం చేజిక్కుంచుకుంది. జాతీయ స్థాయిలో హరిత పాఠశాలగా మూడోసారి ఎంపికై ంది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ)వారిచే ఏటా ఆడిట్ నిర్వహిస్తారు. పాఠశాలను హరిత పాఠశాలగా తీర్చిదిద్దడంలో ఎన్‌సీసీ కోఆర్డినేటర్, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు సురేంద్రబాబు కీలక భూమిక పోషించారు. హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికుల సహకారంతో పాఠశాలను హరిత పాఠశాలగా మార్చడానికి మొక్కలు నాటి సంరక్షించడం, ఆవరణను హరితమయం చేయడంలో విజయం సాధించారు. విద్యుత్‌ను పొదుపుగా వాడడం, 5 స్టార్ పరికరాలు, ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించడంలో లక్ష్యాలను అధిగమించారు. నీటిని పొదుపుగా వాడడం, వృథా నీరు, వర్షపు నీటిని ఒడిసి పట్టి ఇంకుడు గుంతలు, వాటర్ హార్వెస్టింగ్ ద్వారా భూగర్భ నీటి నిల్వలు పెంపొదించడంలో చొరవ చూపారు. దీంతో 2018–19లో కాణిపాకం ఉన్నత పాఠశాలను తొలిసారి జాతీయ స్థాయి పురస్కారం వరించింది. మళ్లీ 2019–20లో రెండోసారి, ప్రస్తుతం 2024–25లో మూడోసారి అవార్డుకు పాఠశాల ఎంపిక కావడం విశేషం.
స్వచ్ఛమైన నీరు
విద్యార్థులకు స్వచ్ఛమైన ఆర్‌ఓ నీరు అందిస్తున్నారు. నీటిని వృథా చేయకుండా పరిమితంగా వాడడం, వృథా నీటిని చెట్లకు మళ్లించడం, వర్షపు నీటిని ఒడిసి పట్టి ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాన్ని పెంచడానికి కృషి చేశారు. మురుగు నీరు నిల్వ లేకుండా చేయడంలో శ్రద్ధ చూపారు. విద్యార్థులకు పోషకాలతో కూడిన సంప్రదాయ ఆహారాన్ని అందించడంలో ప్రత్యేక చొరవ చూపారు. నిల్వ చేసిన ప్యాకింగ్ చేసిన ఆహారాన్ని విద్యార్థులు స్వీకరించకుండా వారిలో అవగాహన పెంపొందించి హరిత పాఠశాలగా రూపొందించడంలో విజయం సాధించారు.
పచ్చదనం పెంపుపై ప్రత్యేక శ్రద్ధ
పాఠశాల ఆవరణలో చెట్లను పెంచడం, సంరక్షించడం, తరగతి గదుల వద్ద పూల మొక్కలు పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించారు. స్వచ్ఛమైన గాలిని ఇచ్చే మొక్కలు పెంచి పోషించడం తద్వారా ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ప్రత్యేక చొరవ చూపారు. దీన్ని పర్యవేక్షించడానికి నేషనల్ గ్రీన్ క్యాప్స్ (ఎన్‌జీసీ) బృందాన్ని భాగస్వామ్యులు చేశారు.
పాఠశాల ఆవరణలో ఏపుగా పెరిగిన చెట్లు
హరిత స్కూల్‌గా కాణిపాకం
జాతీయ స్థాయిలో మూడోసారి ఎంపిక
4న ఢిల్లీలో పురస్కారం స్వీకరణ
సమష్టి కృషితో విజయం
హర్షం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు , స్థానికులు
సమష్టి కృషితో అవార్డు
మా పాఠశాల ఎన్‌సీసీ కోఆర్డినేటర్, సైన్స్ ఉపాధ్యాయుడు, ఇతర ఉ పాధ్యాయులు, వి ద్యార్థుల సమష్టి కృషితో మూడోసారి జాతీయస్థాయి అవా ర్డు దక్కడం సంతోషంగా ఉంది. గాలి, నీరు, నేల, శక్తి, ఆహారం, వ్యర్థాల నిర్వహణ అంశాల్లో విద్యార్థులను జట్లుగా ఏర్పాటు చేసి పాఠశాలలో పర్యావరణ జాగృతి కార్యక్రమాలను నిర్వహించడంతో విద్యార్థుల్లో సానుకూల ధృక్పథం ఏర్పడి తత్ఫలితంగా హరిత పాఠశాల అవార్డు పొందడం గర్వకారణం.
– చంద్రశేఖర్‌నాయుడు, హెచ్‌ఎం, కాణిపాకం, ఐరాల
పంచాయతీకి గర్వకారణం
పాఠశాలలో పరిశుభ్రత, పచ్చదనం పెంచడంలో ఉపాధ్యాయుల, పంచా యతీ సిబ్బంది కృషి మరువలేనిది. పాఠశాల పేరు దేశ స్థాయిలో హరిత పా ఠశాలగా గొప్ప స్థాయికి తీసుకురావడం సంతోషకరం. కాణిపాకం పంచాయతీలో ఉన్న పాఠశాలకు మూడోసారి జాతీయస్థాయి అవార్డు రావడం పాఠశాలకు, పంచాయతీకి, పరిసర గ్రామాల ప్రజలకు గర్వకారణం. –శాంతిసాగర్‌రెడ్డి, సర్పంచ్, కాణిపాకం, ఐరాల
దాతల సాయం
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారు పాఠశాలకు రూ.1.40 కోట్ల సాయం అందించడంతో పాఠశాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. విద్యార్థులకు విశాలమైన తరగతి గదులు, వెలుతురు, గాలి వచ్చేలా తరగతి గదులను నిర్మించారు. గదులకు ఇరువైపులా పూల మొక్కలు, నీడ ఇచ్చే చెట్ల పెంపెకంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment