● వైఎస్సార్‌సీపీకి ఓటేశాడని కేసు ● టీడీపీ వారి నాటు తుపాకుల జోలికెళ్లని పోలీసులు
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : గత ఎన్నికల్లో టీడీపీ నేతలు ఓటుకు వెళ్లినప్పుడు ఓ వ్యక్తిని సైకిల్‌కు ఓటేయాలని అక్కడి టీడీపీ నేతలు అడగ్గా తాను వేయనని వైఎస్సార్‌సీపీకే వేస్తానని ఆ వ్యక్తి సమాధానం ఇచ్చాడు. ఎందుకంటే తనకు జగనన్న ప్రభుత్వంలో ఉండేందుకు పక్కా ఇల్లు వచ్చిందని అందుకే ఓటేస్తానని కూడా వారికి వివరించాడు. దీన్ని మనసులో పెట్టుకున్న ఆ టీడీపీ నేతలు సమయం కోసం వేచి ఉంటూ ఇప్పుడు నాటు తుపాకీ కేసులో ఇరికించేసినట్లు బాధితుడి కుటుంబికులు ఆరోపిస్తున్నారు. వారు తెలిపిన వివరాల మేరకు...పలమనేరు మండలంలోని జరావారిపల్లి పంచాయతీ దొడ్డిపల్లి గ్రామం అడవికి సమీపంలో ఉంది. ఈ గ్రామంలో కొందరు వేట కోసం నాటు తుపాకులను రహస్యంగా ఉంచుకున్నట్లు సమాచారం. ఇలా ఉండగా ఇదే గ్రామానికి చెందిన మొగిలప్ప కుమారుడు నాగప్ప(35), నాగరాజ కుమారుడు శివ(35) స్నేహితులు. కాగా వీరిలో శివ టీడీపీ కార్యకర్త కాగా నాగప్ప వైఎస్సార్‌సీపీ అభిమానిగా ఉంటున్నారు. గతంలో నుంచి వీరిద్దరి వద్ద నాటు తుపాకులున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల వీరిమధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు తెలిసింది. దీంతో నాగప్పవద్ద నాటు తుపాకీ ఉన్న విషయాన్ని శివ అక్కడి కూటమి నేతలకు చెప్పాడు. దీంతో వారు ఎలాగైనా ఈ కేసులో నాగప్పను ఇరికించాలని పోలీసుల సాయంతో కథ నడిపించినట్లు తెలిసింది. దీంతో రెండ్రోజుల కిందట గ్రామంలోకి వచ్చిన పోలీసులు నాగప్పను పట్టుకొని అతని వద్దనున్న నాటు తుపాకీని సీజ్ చేసి స్టేషన్‌కు పట్టుకొచ్చారు. దీంతో ఆగ్రహించిన నాగప్ప కుటుంబికులు, బంధువులు వేటగాళ్ల నాటు తుపాకులున్న అందరి వేటగాళ్లపై కేసులు పెట్టి సీజ్ చేయాలని, అలాగా కాకుండా కేవలం ఒకరిని పట్టుకోవడం ఏంటని దీనిపై తాము ఎస్పీని కలిసి జరిగిన విషయంపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment