ఘనంగా సంకటహర చతుర్థి
కాణిపాకం : స్వయంభు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఆదివారం సంకటహర చతుర్థి గణపతి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చతుర్థి సందర్భంగా ఉదయం ప్రధాన ఆలయంలోని అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలకు సుగంధ పుష్పాలతో అలంకరణ చేసి.. ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ అధికారులు ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లి ఆస్థాన మండపంలో కొలువుదీర్చారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు శాస్త్రోక్తంగా సంకటహర చతుర్థి గణపతి వ్రతం చేపట్టారు. కార్యక్రమంలో ఈఓ పెంచల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
స్వర్ణరథంపై విహారం
స్వయంభు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి రాత్రి ఆలయ మాడ వీధుల్లో స్వర్ణ రథంపై విహరించారు. అలంకార మండపంలో వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలకు ఆలయ అర్చక, వేద పండితులు ప్రత్యేకంగా అభిషేకాలు జరిపించారు. అనంతరం ఆలయ అధికారులు ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామి వారి స్వర్ణ రథంలో కొలువు దీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి స్వర్ణ రథం మంగళ వాయిద్యాలతో మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించారు. భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
భక్తుల రద్దీ
కాణిపాక దేవస్థానానికి ఆదివారం పెళ్లికళ సంతరించుకుంది. పలు వివాహాలతో ఆలయానికి వేకువజాము నుంచే భక్తుల తాకిడి మొదలైంది. భక్తులు స్వామి దర్శనార్థం భారీగా క్యూకట్టారు. అలాగే ఆదివారం కావడంతో ఉదయం నుంచి భక్తజన సందడి మరింత అధికమైంది. ఉదయం10 గంటల ప్రాంతంలో సంకటహర చతుర్థి వ్రతం ఉండడంతో భక్తుల రద్దీ పెరిగింది. భక్తుల రాకతో ఆలయం కిటకిటలాడింది. రాత్రి వరకు కూడా ఈ రద్దీ అలానే కొనసాగింది. భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు దర్శనభాగ్యం కల్పించారు.
ఘనంగా సంకటహర చతుర్థి
Comments
Please login to add a commentAdd a comment