చిత్తూరు మండలంలో అక్రమార్జనకు రాచ‘బాట’ | - | Sakshi
Sakshi News home page

చిత్తూరు మండలంలో అక్రమార్జనకు రాచ‘బాట’

Published Tue, Feb 25 2025 1:50 AM | Last Updated on Tue, Feb 25 2025 1:45 AM

చిత్త

చిత్తూరు మండలంలో అక్రమార్జనకు రాచ‘బాట’

● నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ● అవసరం లేని చోట్ల సీసీ రోడ్ల నిర్మాణం ● యథేచ్ఛగా ప్రజాధనం లూటీ చేస్తున్న కూటమి నేతలు ● వైఎస్సార్‌సీపీకి అనుకూలమైన ప్రాంతాలపై చిన్నచూపు ● చూసీచూడనట్టు వ్యవహరించిన అధికారులు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం):

● చిత్తూరు మండలం కుర్చివేడు పంచాయతీ వీఎన్‌పురం గ్రామంలో ఉన్న సిమెంట్‌ రోడ్డుపై మళ్లీ రోడ్డు వేశారు. గతంలో ఉన్న రోడ్డుకు అక్కడక్కడా గతకులుగా ఉండేదని సాకుగా చూపి సిమెంట్‌ రోడ్డుపైనే మళ్లీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. గతంలో వేసిన సిమెంట్‌ను జేసీబీలతో తొలగించారు. ఊరు మొత్తం నాలుగు వీధులు.. రెండు పొడవాటి దారులకు రోడ్డు నిర్మాణం చేశారు. మొత్తం 600 మీటర్లు కాగా ఇందుకు రూ. 25 లక్షల వరకు వ్యయం చేశారు.

● తుమ్మిందలో గ్రామంలోని ఓ కూటమి నేతకు ఊరికి దగ్గరగా మామిడి తోట ఉంది. ఈ విశాలమైన మామిడి తోటలో ఓ గెస్ట్‌హౌస్‌ కూడా ఉంది. ఆయనకు ఊళ్లో ఇళ్లు ఉన్నా పొలం పనులు, ఇతర అవసరాల కోసం అక్కడ గెస్ట్‌ హౌస్‌ కట్టుకున్నారు. ఈ హౌస్‌కు కూడా సీసీ రోడ్డు వేశారు. 88 మీటర్లకు గాను రూ. 4 లక్షలు వ్యయం చేశారు. దీనిపై గ్రామస్తులు విమర్శలు గుప్పిస్తున్నారు.

● తుమ్మింద దళితవాడ వైఎస్సార్‌సీపీకి అనుకూలమని చిన్నచూపు చూశారు. కాలనీలో రోడ్డు అవసరం ఉన్నా రోడ్డు వేయలేదు. దీంతో కాలనీ బాటరోడ్డు పై పిచ్చిమొక్కలు ఏపుగా మొలిచాయి. సరైనా రోడ్డు మార్గం లేదు. దీంతో ఆ కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వీటిని లెక్క చేయకుండా మామిడి తోటలోని గెస్ట్‌హౌస్‌, ఒకే ఒక ఇంటికి, చెరువు కట్టలపై రోడ్డు వేశారని పల్లెవాసులు మండి పడుతున్నారు.

● తాళంబేడులో గ్రామంలోని ఓ బీడు భూమిలో శ్మశానం పేరు చెప్పి కిలో మీటర్‌ మేర రోడ్డు నిర్మించారు. ఇందుకు రూ. 7 లక్షల వరకు వ్యయం చేశారు. కానీ ఈ రోడ్డు ప్రభుత్వ ధనాన్ని లూటీ చేయడానికే వేసుకున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.

● దిగువమాసాపల్లి పంచాయతీలో కూటమి నేతల వర్గపోరుతో ఇష్టానుసారంగా పనులు జరుగుతున్నాయి. ఆ వర్గం రోడ్డు వేస్తుందని..మరో వర్గం ఎలాంటి అనుమతి లేకుండా రోడ్డు నిర్మాణం చేపట్టింది. ఇంటి గుమ్మాన్ని కూడా వదలకుండా రోడ్డు నిర్మాణం చేపట్టింది. అప్పయ్యగారిపల్లి అనుమతి లేకుండా ఇళ్ల ముందు సిమెంట్‌ రోడ్డు వేసి వదిలేశారు. దిగువ కండ్రిగలో పక్క రోడ్డు చూపించి ఓ ఇంటి ముందు రోడ్డు వేశారు. దీనిపై బిల్లులు పెట్టించాలని కూటమి నేతలు ఒత్తిడి తెస్తున్నారు. కలెక్టర్‌కు సైతం ఫిర్యాదులు వెళ్లాయి.

సీసీరోడ్ల పేరుతో కూటమి నేతలు రోడ్లు మేసి కాసులు దోచేస్తున్నారు. ఇష్టానుసారంగా రోడ్ల నిర్మాణం సాగిస్తున్నారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పట్టించుకోలేదు. కొన్ని చోట్ల సిమెంట్‌ రోడ్లపైనే రోడ్డు వేసి దోచుకున్నారు. మరికొన్ని చోట్ల అవసరం లేకున్నా రోడ్లు వేసి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. కూటమి నేతల గెస్ట్‌ హౌస్‌లకు సైతం రోడ్లు పడుతున్నాయి. పొలాల్లో ఒకే ఒక ఇంటికి రోడ్లు వేసుకున్నారు. వైఎస్సార్‌సీపీకి అనుకూలమైన ప్రాంతాలపై చిన్నచూపు చూస్తున్నారు. దీంతో గ్రామజనం భగ్గుమంటోంది.

చిత్తూరు మండలంలో 17 పంచాయతీలు 117 గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేతల బాగోగుల కోసం సీసీ రోడ్ల నిర్మాణ పనులు జోరుగా మంజూరయ్యాయి. మొత్తం 73 పనులు..8,477 మీటర్లకు గాను రూ.3.56 కోట్లు కేటాయించారు. ఇందులో ఇప్పటి వరకు 46 పనులు..3,530 మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఇందుకు గాను రూ.2 కోట్లకుపైగా వ్యయం చేశారు. మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు కూటమి నేతలు గబగబా రోడ్లు వేస్తున్నారు.

అయ్యప్పగారి పల్లెలో అనుమతి లేకుండా

ఇంటి గుమ్మం వరకు వేసిన సీసీ రోడ్డు

మండల వివరాలు..

సచివాలయాల సంఖ్య 09

పంచాయతీలు 17

గ్రామాలు 117

మంజూరైనా పనులు 73

మంజురైనా మీటర్లు 8,477

నిధుల కేటాయింపు రూ.3.56 కోట్లు

ఇప్పటి వరకు పూర్తయిన పనులు 46..మీటర్లల్లో 3,530

చేపట్టాల్సిన పనులు 27

ఇష్టానుసారంగా చేసిన పనుల సంఖ్య 15 (చెరువు ప్రాంతం,

కట్టప్రాంతం,

మామిడితోటలు, ఇతరా)

రోడ్లపైనే రోడ్లు వేసిన సంఖ్య 04

అనుమతి లేకుండా వేసిన రోడ్లు 03

నాసిరకంగా ఉన్న రోడ్లు 04

బిల్లు చెల్లింపులు రూ. ఒక కోటి

చెల్లించాల్సిన బిల్లులు రూ.1.20 కోట్లు

పనులు దక్కించుకున్న కూటమినేతల సంఖ్య 48 మంది(సుమారు)

నాణ్యతకు పాతర..

సీసీ రోడ్లు నిర్మాణంలో కనీస ప్రమాణాలు పాటించాలనే నిబంధన ఉంది. అయితే అందుకు విరుద్ధగా రోడ్డు నిర్మాణాలు సాగుతున్నాయి. గతంలో రోడ్లు వేస్తే కింద పట్టా, రోడ్డుకు మధ్య భాగంలో అక్కడక్కడా బెర్ములు అమర్చేవారు. ఎండ కాలంలో సిమెంట్‌ రోడ్లు కూడా సాగుతాయని..ఇలా చేస్తే రోడ్లు తొందరగా పాడవ్వకుండా ఉంటాయని అధికారులు అంటున్నారు. ఇప్పుడు ఆ పట్టాలు, బెర్ములు ఎక్కడా కనిపించ లేదు. రోడ్డుకు మధ్యలో అక్కడక్కడ మిషన్‌తో సన్నటి గీతలు చేస్తున్నారు. అది కూడా ౖపైపెకే జరుగుతున్నాయి. ఆ గీతలో తారు పోసేస్తున్నారు. ఇక రోడ్డు వేసే సమయంలో సిమెంట్‌, ఇసుక, కంకరను 1:2:4 నిష్పత్తిలో వినియోగించాలి. అంటే బస్తా సిమెంట్‌కు రెండు బస్తాల ఇసుక, నాలుగు తట్టల నల్లకంకర వేయాలి. కానీ పనులు జరిగిన చోట పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. సిమెంట్‌ కాంక్రీట్‌ మిశ్రమంలో నిబంధనలు పాటించడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇసుక, కంకరను ఎక్కువగా వినియోగిస్తూ..సిమెంట్‌ను నామమాత్రంగా వినియోగించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు చాలా చోట్ల కల్తీ సిమెంట్‌ ( బూడిద కలిపిన సిమెంట్‌) వాడుతున్నారు. ఇదీ తక్కువ రేటుకు వస్తుందని...అధిక మొత్తంలో ఇలాంటి సిమెంట్‌ను వాడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో కాంట్రాక్ట్‌లుగా అవతారమెత్తిన కూటమి నేతలకు కాసులు కురిపిస్తున్నాయి.

ఇష్టానుసారంగా పనులు..

రోడ్లు మంజూరైన నెలల వ్యవధిలోనే నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే మండలంలో దాదాపు 50 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. అయితే ఆవేసిన రోడ్లను పలుచోట్ల పరిశీలిస్తే..ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. నేతల స్వార్థం కోసమే రోడ్లు వేశారు. కూటమినేతే కాంట్రాక్ట్‌గా అవతారమెత్తి అతని గెస్ట్‌హౌస్‌కు రోడ్డు వేసుకున్నారు. పెద్దిశెట్టిపల్లి పంచాయతీ దిగువూరు ప్రాంతంలోని వ్యవసాయ పొలంలో ఉన్న ఒకే ఒక ఇంటికి రోడ్డు వేశారు. ఈ గ్రాామం నుంచి అటవీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో ఇష్టానుసారంగా రోడ్లు వేశారు. తుమ్మిందలో చెరువు కట్టపై రోడ్డు వేశారు. చెరువు కట్టపై సీసీ రోడ్డు వేసేందుకు ఎలాంటి అనుమతులు లేవని, ఈ రోడ్డు ఎలా వేస్తారని కొంత మంది అధికారులు చెబుతున్నారు. కుర్చివేడులో రోడ్డు నిర్మాణం నిబంధనలకు విరుద్దంగా జరిగినట్లు అంటున్నారు. ఇలా పలుచోట్ల విచ్చలవిడిగా రోడ్లు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పల్లె ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
చిత్తూరు మండలంలో అక్రమార్జనకు రాచ‘బాట’ 
1
1/1

చిత్తూరు మండలంలో అక్రమార్జనకు రాచ‘బాట’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement