● కుప్పంలో 7489 ఎస్సీ, ఎస్టీ గృహాలకు సోలార్ రూఫ్ టాప్
సాక్షి, అమరావతి: కుప్పం నియోజకవర్గంలోని 7489 ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారులకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు కుప్పం రూరల్ ఎలక్ట్రిక్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్(కెఆర్‌ఈసీఎస్‌ఎల్) సమర్పించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్)ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే నియోజకవర్గంలో 30వేల వ్యవసాయ పంపుసెట్లను సోలరైజ్ చేసే ప్రాజెక్టును కూడా అదే డీపీఆర్‌లో పొందుపరిచారు. దానికి కూడా ప్రభుత్వం అనుమతించింది. అయితే ఈ ప్రాజెక్టులకు అయ్యే ఖర్చును మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా భరించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ రూఫ్‌టాప్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు కేంద్రం నుంచి కొంత సబ్సిడీ వస్తుంది. మిగతా మొత్తాన్ని కెఆర్‌ఈసీఎస్‌ఎల్‌గానీ, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఎస్పీడీసీఎల్)గానీ పెట్టుబడిగా భరించాల్సి ఉంటుంది. అలా పెట్టిన పెట్టుబడి 3 నుంచి 5 ఏళ్లలో తిరిగి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక సోలార్ పంపుసెట్లకు పీఎం కుసుమ్ పథకం ద్వారా వచ్చే నిధులతో ఏర్పాటు చేసుకోవాలని, దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు అడగనవసరం లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment