చందాలతో వేసుకున్న రోడ్డుకు కూటమి బిల్లు ?
భక్తుల చందాలతో నిర్మించుకున్న రోడ్డు
శాంతిపురం : దేవుడి ఊరేగింపును తీసుకురావటానికి తాము ఏర్పాటు చేసుకున్న మట్టి రోడ్డుకు స్థానిక టీడీపీ నేతలు బిల్లు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని భక్తులు ఆరోపించారు. కొలమడుగు పంచాయతీలోని కదిరిముత్తనపల్లిలో సిద్దేశ్వరస్వామి ఆలయం ఉంది. పొరుగున ఉన్న రెడ్లపల్లి గ్రామస్తులు కొందరు శివరాత్రి సందర్భంగా తమ గ్రామంలో దేవుడి ఊరేగింపు జరపాలనుకుని నిర్ణయించుకున్నారు. తలా కొంత చందాలు వేసుకుని రెండు గ్రామాల మధ్య పాలారు నదిలో తాత్కాలిక మట్టి రోడ్డును రెండు రోజుల కిందట నిర్మించుకున్నారు. మరో నెల రోజుల్లో సిద్దేశ్వరస్వామి ఆలయంలో 12 ఏళ్లకు ఓసారి జరిగే కురబ కులస్తుల జాతరకు ఈ రోడ్డు ఉపయోగపడుతుందని అనుకున్నారు. కానీ కొందరు టీడీపీ నాయకులు సోమవారం పంచాయతీరాజ్ ఇంజినీరును తీసుకొచ్చి మట్టి రోడ్డు ఫొటోలు తీసుకుపోయినట్లు గుర్తించారు. దీంతో తాము భక్తితో నిర్మించుకున్న మట్టి రోడ్డును చూపి అధికార పార్టీ నాయకులు బిల్లు చేసుకోకుండా చూడాలని కోరుతూ గ్రామస్తులు వాపోయారు. అదే రోడ్డుపై నిరసన తెలిపి, ఎంపీడీఓకు వినతి పత్రం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment